హీరోల పారితోషికాలు త‌గ్గించుకోవాల్సిందేనా?

మరిన్ని వార్తలు

క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డిన  సంక్షోభం అంతా ఇంతా కాదు. ఈ ప్ర‌భావం అన్ని రంగాల‌పైనా ప‌డింది. మ‌రీ ముఖ్యంగా వినోద‌రంగం. ఈ దెబ్బ‌కు సినిమా ప‌రిశ్ర‌మ డీలా ప‌డిపోయింది. నెల రోజులుగా ఎవ‌రికీ ప‌ని లేదు. షూటింగులు ఆగిపోయాయి. సినిమాల విడుద‌ల లేదు. నిర్మాత‌లు భారీ ఎత్తున న‌ష్ట‌పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పాపం నిర్మాత‌ల‌కు ఎప్పుడూ క‌ష్టాలే. మూలిగే న‌క్క‌పై ఇప్పుడు తాటి పండు ప‌డిన‌ట్టైంది. ఈ ప‌రిస్థితి నుంచి చిత్ర‌సీమ‌ను ఒడ్డున ప‌డేయాల్సిన బాధ్య‌త హీరోలపై ఎంతైనా ఉంది.

 

అవును... నిర్మాత లేక‌పోతే చిత్ర‌సీమ‌నే లేదు. సినిమా అనే వ్య‌వస్థ‌కు ఆది - అంతం అన్నీ నిర్మాతే. వాళ్ల‌ని ఆదుకోక‌పోతే చిత్ర‌సీమ‌కు మ‌నుగ‌డే లేదు. క‌రోనా వ‌ల్ల ఏ నిర్మాత ఎంత న‌ష్ట‌పోతున్నాడ‌న్న లెక్క‌లు ఇప్ప‌ట్లో తేల‌వు. మ‌ళ్లీ సినిమా ఇండ్ర‌స్ట్రీ ట్రాక్ లో ప‌డితే గానీ ఆ అంకెలు అర్థం కావు. కాక‌పోతే.. ఈలోగా హీరోలు చేయాల్సిన ప‌ని ఒక‌టుంది. అది నిర్మాత‌కు `మేమున్నాం` అనే భ‌రోసా క‌ల్పించ‌డం. ఇప్ప‌టికే సెట్స్‌పై ఉన్న సినిమాల విష‌యంలో హీరోలు మ‌రింత సహృద‌యంతో ముంద‌డుగు వేయాల్సిన ప‌రిస్థితి. ఆయా సినిమాల‌కు సంబంధించిన పారితోషికాలు ఇప్ప‌టికే డిసైడ్ అయిపోయి ఉంటాయి. వాటిలో నిర్మాత‌ల‌కు కొంత మిన‌హాయింపు ఇవ్వాల్సిన త‌రుణ‌మిది.

 

సినిమాలు హిట్ట‌యితే.. హీరోలు పారితోషికాలు పెంచేస్తారు. కొంత‌మంది ఫ్లాపయినా స‌రే - రేటుని దించ‌రు. ఈసారి మాత్రం తీసుకోవాల్సిన పారితోషికంలో కాస్త రిబేటు ఇచ్చి నిర్మాత‌ల్ని క‌నిక‌రించాల్సిందే. మార్చి, ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సిన కొన్ని చిత్రాలు ఇప్ప‌డు అర్థాంత‌రంగా ఆడిపోయాయి. వేస‌విలో రావాల్సిన సినిమాలు మ‌రికొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటి విడుద‌ల కూడా అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఈ చిత్రాలకు సంబంధించి క‌థానాయ‌కులు ఇప్ప‌టికే పారితోషికాలు తీసేసుకుని ఉంటారు. వాటిలొ కొంత తిరిగి ఇస్తే బాగుంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

నిజంగా సినిమా అద్భుతంగా ఆడి, భారీ లాభాలు ఆర్జిస్తే.. ఎలాగూ నిర్మాత‌లు కానుక‌లు ఇచ్చి, హీరోల్ని సంతృప్తి పరిచే సంస్క్రృతి మ‌న తెలుగు ఇండ్ర‌స్ట్రీ లో ఉండ‌నే ఉంది. సో.. ప్ర‌కృతి వైప‌రిత్యాలు వ‌చ్చిన‌ప్పుడు భారీ విత‌ర‌ణ‌లు ప్ర‌క‌టించి, స‌మాజాన్ని ఎలా ఆదుకోవాలని చూస్తున్నారో, అలానే పెద్ద మ‌న‌సుతో ఈసారి నిర్మాత‌ల్నీ ఆదుకోవాలి. మ‌న హీరోలంతా రియ‌ల్ హీరోలు అనిపించుకోవాలంటే.. ఈ ఒక్క అడుగూ వేయాల్సిందే. నిర్మాత‌ల్ని ఈ గ‌డ్డుకాలంలో గ‌ట్టెక్కించాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS