టాలీవుడ్ కి తెలుగు ప్రభుత్వాలు ఇచ్చిన సంక్రాంతి ఆఫర్ అయిపోయినట్టే. ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి ముందే నైట్ కర్‌ఫ్యూ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసింది. దాని ప్రకారం.... సెకండ్ షోలకు ఛాన్స్ లేనట్టే. అయితే సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి కీలకం కాబట్టి, ఈ జీవోని వాయిదా వేశారు. ఇప్పుడు... మరోసారి ఆంక్షల్ని అమలు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో రాత్రిపూట కర్‌ఫ్యూ వల్ల ఫస్ట్ షో, సెకండ్ షోలు దాదాపుగా రద్దు అయినట్టే. మహా అయితే.. ఫస్ట్ షోకి అనుమతి వస్తుంది. సెకండ్ షోపై ఆశలు వదులు కోవాలి.
ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి నిబంధనలే వర్తింపజేసే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ నైట్ కర్‌ఫ్యూని అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ ఈ నిబంధనలు అమలులో ఉండొచ్చు. దాంతో.. ఫస్ట్ షోలకు సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. సంక్రాంతి సీజన్ కోసమే.. ప్రభుత్వాలు ఇప్పటి వరకూ నైట్ కర్‌ఫ్యూ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ అయిపోయింది కదా... అందుకే... మళ్లీ రంగంలోకి దిగాయి. త్వరలో విడుదల కావాల్సిన సినిమాలకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితే.