లాక్ డౌన్ నుంచి చిత్రసీమకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చింది. షూటింగులు కూడా మొదలు పెట్టుకోమని చెప్పింది. ఈ విషయమై చిత్ర సీమలోకి కీలకమైన వ్యక్తులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి వివిధమైన అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి నుంచి కొన్ని హామీలు తీసుకున్నారు.
ఇప్పుడు ఏపీ సీఎమ్ జగన్ తో ములాఖాత్ అవ్వడానికి చిత్రసీమ సిద్ధమైంది. త్వరలోనే జగన్తో టాలీవుడ్ భేటీ వేయబోతోంది. షూటింగుల పర్మిషన్ల గురించీ, చిత్రసీమకు ఇవ్వాల్సిన రాయితీల గురించి జగన్తో కలిసి మాట్లాదబోతోంది టాలీవుడ్. ఇటీవలే ఏపీ ప్రభుత్వం సినిమా షూటింగుల విషయంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జగన్ని కలిసి ధన్యవాదాలు చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టాలీవుడ్ తరపున ఎవరూ వెళ్లి కలిసింది లేదు. ఆయనకు అభినందనలు చెప్పింది లేదు. ఇప్పుడు ఆ అవకాశం కూడా వచ్చినట్టైంది.