కరోనా కాలంలో.. నిర్మాతల్ని ఓటీటీ ఆదుకొంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటీ డౌట్లూ లేవు. ఆ రోజుల్లో థియేటర్లు లేకపోవడం వల్ల... కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేశాయి.
అందులో 'నారప్ప' ఒకటి. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన `అసురన్`కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణే వచ్చింది. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయలేనందుకు వెంకటేష్ చాలా బాధ పడ్డాడు. అయితే ఆ లోటు ఇప్పుడు తీరబోతోంది. ఈ సినిమాని ఇప్పుడు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత డి.సురేష్ బాబు నిర్ణయం తీసుకొన్నారు. సో... తెలుగు రాష్ట్రాలలో నారప్పని థియేటర్లలో చూసేయొచ్చు. ఇప్పటికే ఈ సినిమాని చాలామంది ఓటీటీలో చూశారు. కానీ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వేరు కదా..? అందుకే థియేటర్లలో ఈ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ముందుకొస్తారని సురేష్ బాబు నమ్మకంగా చెబుతున్నారు.
`నారప్ప`కి గనుక టికెట్లు తెగితే.... అప్పట్లో ఓటీటీల్లో విడుదలైన సినిమాలన్నీ మళ్లీ థియేటర్లలో విడుదల కావడం ఖాయం. అలా.. చిత్రసీమకు ఓ కొత్త ట్రెండ్ వచ్చినట్టే.