తెలుగు సినీ పరిశ్రమ దసరా సీజన్ మీద చాలా ఆశలే పెట్టుకుంది. అక్టోబర్ 1 నుంచి సినిమా థియేటర్లు తెరచుకునే అవకాశం వుందన్న నేపథ్యంలో, చాలా చాలా ఆశగా దసరా సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ పరమైన ఆందోళనలు, సభలు, సమావేశాలూ ఇప్పటికే జోరందుకున్నాయి. సెప్టెంబర్ 20 తర్వాత మరిన్ని వెసులుబాట్లు రాబోతున్నాయి. జన జీవనం దాదాపుగా సాధారణ స్థితికి వచ్చేసింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకున్నా, వ్యాధి తీవ్రత అయితే పెద్దగా కనిపించని నేపథ్యంలో సినిమా థియేటర్లకూ గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో దసరాకి ఓ మోస్తరు సినిమాలు కొన్ని విడుదలయ్యే అవకాశం వుందట. దసరా సీజన్ సక్సెస్ అయితే, దీపావళికి మరిన్ని సినిమాలు విడుదలయ్యేందుకు ఆస్కారమేర్పడుతుంది. ఒక్కసారి ది¸యేటర్లు ఓపెన్ అయితే.. ఆ తర్వాత రిలీజులు ఓ రేంజ్‌లో వుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు తమ షూటింగుల్ని పూర్తి చేసేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలకు ఓటీటీ ఆఫర్లు బాగా వస్తుండడంతో వాటితోనే సరిపెట్టేసుకుంటున్న దరిమిలా, మిగతా సినిమాలకు లైన్ దాదాపు క్లియర్ అవుతున్నట్లే.
షాపింగ్ మాల్స్ ఇప్పుడిప్పుడే కిటకిటలాడుతున్న దరిమిలా, సినిమా హాళ్ళు కూడా తక్కువ సమయంలోనే ‘క్రౌడెడ్’గా దర్శనమిస్తాయని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు. చూద్దాం, ఏం జరుగుతుందో.