గత రెండు రోజులగా... రిలీజ్ డేట్ల హంగామా కనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదల తేదీలు ప్రకటించేశాయి. ఇంకా కొత్త కొత్త డేట్లు బ్లాక్ చేస్తూనే ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్‌తో మొదలైన ఈ ప్రవాహం.. ఆచార్య, భీమ్లా నాయక్, ఎఫ్ 3, సర్కారు వారి పాట, గని, రామారావు ఆన్ డ్యూటీ... ఇలా కొనసాగుతూనే ఉంది. ఎందుకైనా మంచిదని... ఒక్కో సినిమా రెండేసి డేట్లు బ్లాక్ చేసుకుంది. జనవరిలో సైలెంట్ గా ఉన్న ఈసినిమాలన్నీ ఇప్పుడే ఎందుకు ఒకేసారి మేల్కొన్నాయి? గంపగుత్తగా రిలీజ్ డేట్లు ఎందుకు ప్రకటించాల్సివచ్చింది? అనే చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది.
నిన్నా మొన్నటి వరకూ కరోనా అందరినీ భయపెట్టింది. థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దాంతో లాక్ డౌన్లు ప్రకటిస్తారని ఊహించారు. దానికి తోడు రాత్రిపూట కర్‌ఫ్యూ కొనసాగడం ఇబ్బంది పెట్టింది. అయితే.. ఇప్పుడు కరోనా ప్రభావం అంతంత మాత్రమే అని తేలిపోయింది. నైట్ కర్‌ఫ్యూలు ఎత్తేస్తున్నారు. అన్నిటికి మించి... ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసింది. టాలీవుడ్ కోరినట్టు జీవో సవరించి, రేట్లు పెంచుకునే సౌలభ్యం నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాకున్నా... ఇది జరగడం పక్కా అనే సంకేతాలు నిర్మాతలకు అందేశాయని, అందుకే ఇలా వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటించేశారని సమాచారం. ముందు ఎవరు రిలీజ్ డేట్ ప్రకటిస్తే... వాళ్లకే కదా ఛాయిస్. అందుకే సినిమాలన్నీ ఇలా రిలీజ్ డేట్లతో హోరెత్తిపోయాయి. ఇటీవల టికెట్ రేట్ల పెంపు విషయానికి సంబంధించి టాలీవుడ్ లో భారీ చర్చ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. జగన్ ల మధ్య భేటీ కూడా జరిగింది. అవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయని, జగన్ టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అందుకే... కొత్త సినిమాల హడావుడి మొదలైపోయింది.