ఏపీ ప్రభుత్వం- సినిమా టికెట్ల అమ్మకాలు అనే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి సినిమా- రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాటలతో ఇష్యూ మొత్తం ఏపీ సర్కార్ -జనసేనగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ మాటలతో తమకి సంబంధం లేదని టాలీవుడ్ ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ ప్రకటన ఇచ్చింది. దానితో తోడు టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడలేదు. అటు అధికార పార్టీ నాయకులు పవన్ పై మాటల దాడి చేస్తున్నా ఒక్కరూ ఖడించలేదు. పైగా పవన్ తో అంటిముట్టనట్టు వ్యవహరించారు.
మొన్న దిల్ రాజు ఏపీ సర్కార్ పెద్దలతో భేటి అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ ప్రస్థావన లేకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఈ రోజు (శుక్రవారం) పవన్ కల్యాణ్‌తో ప్రముఖ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆయన నివాసంలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, సునీల్ నారంగ్, బన్నీ వాసు, వంశీరెడ్డి తదితరులు పవన్‌ను కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. ఈ భేటిలో ఎలాంటి అంశాలు చర్చలోకి వచ్చాయనే విషయం తెలియాల్సివుంది. మొత్తానికి రిపబ్లిక్ ఈవెంట్ తర్వాత పరిస్థితిలు సీరియస్ గా మారిపోయిన నేపధ్యంలో ఈ భేటి ప్రాధన్యత సంతరించుకుంది.