ఓ పోస్టర్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ సినిమా కరోనాని జయించేసిందంటూ ఇచ్చిన ప్రకటనే ఈ చర్చకు కారణం. ఆ సినిమా ఇంకోటేదో కాదు, ‘క్రాక్’. సినిమా ప్రమోషన్‌లో ఇదొక కొత్తదనం అనుకోవాలంతే. లేకపోతే, సినిమా కరోనాని జయించేయడమేంటి.? గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, ఘనవిజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. నిజమే, ఈ సినిమా కరోనాని జయించింది.. వసూళ్ళ పరంగా, కరోనా టెన్షన్స్ పరంగా.
ఆ మాటకొస్తే, ఈ సినిమా కంటే ముందు కరోనాని జయించింది సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’. వచ్చేస్తున్నాయ్.. ఇంట్రెస్టింగ్ మూవీస్ అన్నీ వచ్చేస్తున్నాయ్. కరోనా భయాల్లేవిప్పుడు. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తున్న దరిమిలా, సినిమాలు ధైర్యంగా క్యూ కట్టేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకుండానే సినీ పరిశ్రమకి వసూళ్ళ కళ రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
అయితే, ఇంకా కరోనా నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో ఇంకాస్త వెసులుబాటు వస్తే, సినీ పరిశ్రమ గాడిన పడ్డట్టే అవుతుంది. ఈ సంక్రాంతికి ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ తదితర సినిమాలు విడుదల కానున్న విషయం విదితమే. ఉప్పెన తదితర సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.