టెలివిజన్ ఇండస్ట్రీని 'బుల్లితెర' అనడం, సినిమా ఇండస్ట్రీని 'వెండితెర' అనడం తెలుసు. సిల్వర్ స్క్రీన్ కన్నా టీవీ స్క్రీన్ చిన్నది కాబట్టి, టీవీని 'చిన్నతెర' అంటాం. అయితే టెలివిజన్ ఇండస్ట్రీ ఏమాత్రం చిన్నది కాదు. వెండితెరకి నటీనటుల్ని అందిస్తోన్న 'ఫ్యాక్టరీ'గా మారింది టెలివిజన్ ఇండస్ట్రీ. అలాగే వెండితెర నుంచీ తారలు, బుల్లితెరవైపు చూస్తున్నారు. టెలివిజన్ సీరియల్స్ అంటే ఒకప్పుడు ఏడుపు కోసమే అన్న భావన ఉంది. అయితే ఇప్పుడక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ బీభత్సంగా ఉంటోంది. టెలివిజన్ ఇండస్ట్రీలో ఏదైనా చేసుకోవచ్చనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. తద్వారా వెండితెరను మించిపోయేలా తెలుగు టీవీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని అనడం నిస్సందేహం. దర్శకరత్న దాసరి నారాయణరావు, టెలివిజన్ కోసం పనిచేసినా, అక్కినేని నాగార్జున ఓ గేమ్ షో నిర్వహించినా, చిరంజీవి కూడా బుల్లితెరకు వస్తున్నా ఇదంతా టెలివిజన్ ఇండస్ట్రీలో కొత్త తరహా మార్పులుగానే భావించవలసి ఉంటుంది. భవిష్యత్ టెలివిజన్ ఇండస్ట్రీ మూడు పువ్వులు ముప్పయ్ ఆరు కాయలుగా వర్దిల్లనుందని సినీ ప్రముఖులే అంటున్నారు. ప్రధానంగా బుల్లితెరపై గేమ్ షోస్, డాన్స్ షోస్, కామెడీ షోస్ అద్భుతమైన అవకాశాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇలాంటి టాలెంట్ హంట్స్ ద్వారా ఔత్సాహికులు తమలోని టాలెంట్స్‌ని ప్రపంచానికి పరిచయం చేయగలుగుతుండడం అభినందనీయం. అందుకే ఇది బుల్లితెర కాదు, ఇది కూడా పెద్ద తెరగానే భావించవలసి ఉంటుంది.