త్రిషకు మళ్లీ పూర్వ వైభవం వస్తున్నట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా పెద్ద గా సినిమాలు చేయని త్రిష ఇప్పుడు మళ్లీ వెండి తెరపై ఫోకస్ పెట్టింది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో త్రిష కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈనెలాఖరున పొన్నియన్ సెల్వన్ విడుదల అవుతోంది. ప్రచార చిత్రాల్లో త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. పదేళ్ల క్రితం త్రిష ఎలా ఉందో... ఇప్పుడూ అలానే ఉంది. దాంతో దర్శకుల దృష్టి మళ్లీ త్రిషపై పడింది. తాజాగా త్రిషకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు కోలీవుడ్ టాక్.
విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కథానాయికగా త్రిషని ఎంచుకొన్నట్టు సమాచారం. విజయ్ - త్రిషలు కలిసి ఇది వరకు `కురువి` అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా విడుదలై 14 ఏళ్లయ్యింది. అంటే.. పద్నాలుగేళ్ల తరవాత ఈ సూపర్ హిట్ జోడీ మళ్లీ తెరపై సందడి చేయబోతోందన్నమాట. త్రిషకు ఇప్పుడు తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్టు టాక్. నిన్నా మొన్నటి వరకూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టిన త్రిష ఇప్పుడు... కమర్షియల్ సినిమాలవైపు చూస్తోందని సమాచారం.