మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ని వేటాడే సింహంగా అభివర్ణించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో. సింహం ఎప్పుడంటే అప్పుడు వేటాడదనీ, ఆకలి వేసినప్పుడే వేటాడుతుందనీ.. ఆ తర్వాత మళ్ళీ ఆకలి వేసేదాకా వేట జోలికి వెళ్ళదనీ, వేటకు వెళితే మాత్రం ఆ వేట ఓ రేంజ్‌లో వుంటుందనీ.. సింహం తినగా మిగిలింది నక్కలు, హైనాలు తినాల్సిందేనని త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశాలుగా మారాయి.
సినీ ఈవెంట్స్‌లో ఈ తరహా పొగడ్తలు సర్వసాధారణమే అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తి, లైన్ దాటి చేసిన పొగడ్తలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ పరిశ్రమలో చాలామందికి అత్యంత సన్నిహితుడు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా పలువురు హీరోలతో సన్నిహిత సంబంధాలున్న త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడని అందరికీ తెల్సిందే.
మెగా కాంపౌండ్‌పై తనకున్న ప్రేమని త్రివిక్రమ్ ఇలా చాటుకున్నాడని కొందరు అంటోంటే, ఇంకొందరు త్రివిక్రమ్ కూడా 'భజన' జాబితాలో చేరిపోయాడని ఇంకొందరు అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ధృవీకరించడం గమనార్హం. 'సస్పెన్స్ రివీల్ చేసేశానా.?' అంటూ నిర్మాత డివివి దానయ్యతో చిరంజీవి ఆ తర్వాత చెప్పారనుకోండి. అది వేరే సంగతి.