పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలొస్తే... అందులో రెండు సూపర్ డూపర్ హిట్లు. 'అజ్ఞాతవాసి' మాత్రం బాగా నిరాశపరిచింది. ఈ సినిమా ఫ్లాప్‌తో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని బయట జనాలు చెప్పుకుంటున్నా.. అవేం నిజం కాదని త్రివిక్రమ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు.
ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఉన్నాడు. పవన్ కి పొలిటికల్ డైలాగులు నేర్పుతున్నది త్రివిక్రమే అని, ఆయన రాసిచ్చిన స్క్రిప్టులనే పవన్ చదువుతున్నాడని చెప్పుకుంటూ ఉంటారు. వీటిపై త్రివిక్రమ్ స్పందించాడు.
''పవన్‌కి నేనెప్పుడూ సలహాలు ఇవ్వలేదు. స్క్రిప్టులు అస్సలు ఇవ్వలేదు. నా సినిమాలకు స్క్రిప్టులు రాసుకోవడానికే నాకు బద్దకం. ఇక పవన్‌కి ఎలా ఇస్తాను? పవన్ తన విషయాల గురించి సొంత అన్నయ్యకే చెప్పరు. ఇక నాకెందుకు చెబుతారు?'' అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సరదాగా సమాధానం చెప్పాడు త్రివిక్రమ్.
పవన్ తనకు మంచి స్నేహితుడని, తమ మధ్య ఆ బంధం అలానే ఉందని క్లారిటీ ఇచ్చేశాడు.