మహేష్‌బాబు - త్రివిక్రమ్‌లది ఎప్పటికైనా ఆసక్తికరమైన కాంబినేషనే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు'ని ఇప్పటికీ అభిమానులు గుర్తుంచుకుంటారు. 'ఖలేజా' బాక్సాఫీసు దగ్గర ఫ్లాప్ అయినా... టీవీల్లో తెగ చూస్తుంటారు. త్రివిక్రమ్ బెస్ట్ మూవీస్‌లో ఖలేజా ఒకటని ఆయన అభిమానులు చెబుతుంటారు. మరి వీరిద్దరి హ్యాట్రిక్‌సినిమా ఎప్పుడు? దీనిపై త్రివిక్రమ్ స్పందించాడు.
''మేం కూడా గట్టిగానే అనుకుంటున్నాం. తనతో ఓ సినిమా చేయాలి. ఎప్పుడన్నది చెప్పలేను. నేను, తనూ సినిమాలతో బిజీ అయిపోయాం. కుదిరినప్పుడు కచ్చితంగా చేస్తాం'' అన్నాడు త్రివిక్రమ్. వెంకటేష్ సినిమా ప్రస్తావన తీసుకొస్తే... ''రెండు మూడు కథలు అనుకున్నాం. కానీ... అంతగా ఎగ్జయిట్ చేయలేదు. ఆయనకూ, నాకు కిక్ ఇచ్చే కథ రాగానే తప్పకుండా చేసేస్తాం'' అని చెప్పుకొచ్చాడు. తరువాతి సినిమా బన్నీతోనేనా? అని అడిగితే దానికీ క్లారిటీగా సమాధానం చెప్పలేదు.
''ఆ సినిమా గురించి మాట్లాడుకోవడానికి కొంచెం సమయం ఉంది. ఇప్పుడంతా అరవింద సమేత పైనే దృష్టి పెట్టా'' అంటున్నాడు త్రివిక్రమ్.