మలయాళ చిత్రం `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. అయితే తెర వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ... త్రివిక్రమ్‌నే. ఎందుకంటే ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా. సితార అంటే... త్రివిక్రమ్ సొంత సినిమా. మలయాళ సినిమాని రీమేక్ చేయాలన్న ఆలోచన.. త్రివిక్రమ్ దే. పవన్ కల్యాణ్ ని రంగంలోకి దింపింది కూడా ఆయనే. ఈ స్క్రిప్టులో త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉందని, ఆయన డైలాగులు రాస్తున్నారని... చిత్రసీమలో గుసగుసలు వినిపించాయి.
నిజానికి.. సాగర్ చంద్ర ఈస్క్రిప్టుని ఎప్పుడో పూర్తి చేసేశాడు. మార్పులు చేర్పులూ చేసి వినిపించాడు. ఆ వెర్షన్ పవన్‌కి నచ్చడం వల్లే, ఈ సినిమా ఒప్పుకున్నాడు. స్క్రిప్టు విషయంలో త్రివిక్రమ్ చేసిందేం లేదు. డైలాగులూ ఆయన రాయలేదు. అంతా సాగర్ చంద్రనే చూసుకున్నాడు. అయితే ఇప్పుడు స్క్రిప్టు మాత్రం త్రివిక్రమ్ దగ్గరకు వచ్చింది. ఫైనల్ రీడ్ చేసి, కొన్ని కీలకమైన సన్నివేశాలకు మాత్రం త్రివిక్రమ్ మాట సాయం చేయనున్నాడట. అయితే డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ పేరు కనిపించదు. ఎందుకంటే.. త్రివిక్రమ్ ఈ సినిమాలో ఇన్‌వాల్వ్ అయ్యాడని తెలిస్తే... కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. `తీన్ మార్ ` విషయంలోనూ అదే జరిగింది. ఆసినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందించాడు. దాంతో అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవడంలో ఆ సినిమా విఫలం అయ్యింది. ఆ భయాన్ని దృష్టిలో ఉంచుకునే, త్రివిక్రమ్ ఈ సినిమాకి `మాట` సాయం చేసినా...దాన్ని బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం