హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అనగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ బ్యానర్ వెనుక కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. నిర్మాత రాధాకృష్ణకు త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఇప్పుడు ఈ బ్యానర్‌లోనే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా.. ఈ సంస్థ నుంచి పుట్టుకొచ్చిందే. ఈ రెండు సంస్థల్లోనూ.. త్రివిక్రమ్ కి వాటా ఉందన్నది బహిరంగ రహస్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ `అప్పయ్యయుమ్ కోషియమ్` రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వెనుక త్రివిక్రమ్ హస్తం ఉంది.
అయితే ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ... నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతోంది. ఈ విషయాన్ని బాలయ్య ప్రకటించారు. మరి సితార బ్యానర్‌లో ఈ సినిమా ఫిక్సయ్యింది కాబ్టటి, దర్శకుడిగా త్రివిక్రమ్ ఉంటాడా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది. బాలయ్య - త్రివిక్రమ్ కాంబో సెట్టయితే... అది వేరే లెవల్ లో ఉంటుందన్నది వాస్తవం. అయితే.. ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే త్రివిక్రమ్ ఫుల్ బిజీలో ఉన్నాడు. 2024 వరకూ ఆయన సినిమాలన్నీ ఫైనల్ అయిపోయాయి. కాబట్టి... బాలయ్యతో కాంబో ఉండకపోవొచ్చు. కాకపోతే... బాలయ్య కోసం రెడీ అయ్యే కథ వెనుక త్రివిక్రమ్ హస్తం ఉంటుంది. ఎందుకంటే సితార ఓకే చేసిన కథలన్నీ.. ముందు త్రివిక్రమ్ విని ఓకే అంటాడు. అలా.. బాలయ్య కథని ఓకే చేయాల్సిన బాధ్యత కూడా త్రివిక్రమ్ పైనే ఉంటుంది. ఆ తరవాత.. ఆ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లి.. రిలీజ్ అయ్యేంత వరకూ అన్ని విషయాలూ త్రివిక్రమ్ `డైరక్షన్`లోనే జరుగుతాయి. సో.. ఆ రకంగా.. వీరిద్దరి కాంబో సెట్ అయినట్టే.