`మా` ఎన్నికల వేడి, అక్కడ జరుగుతున్న తంతు తెలియని విషయాలు కాదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పోటీ నువ్వా? నేనా? అన్నట్టు నడుస్తోంది. బరిలో ఎంతమంది ఉన్నా- ఫోకస్ అంతా ప్రకాష్ రాజ్, విష్ణులపైనే. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి, తన ప్యానల్ ని ప్రకటించడం, విష్ణు సైతం చురుగ్గా ప్రచారం మొదలెట్టేయడం `మా`లో ఉన్న రాజకీయ వైఖరి చెప్పకనే చెబుతున్నాయి. `మా బిల్డింగ్ కి డబ్బులు నేనిస్తా. పెద్దలు ఏకగ్రీవంగా ఎవరిని ఎంచుకున్నా పోటీ నుంచి తప్పుకుంటా` అని ప్రకటించిన విష్ణు ఇప్పుడు ఉన్నట్టుండి తన ప్రచార వైఖరిని మార్చాడు. `జైలుకెళ్లాల్సిన వాళ్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు` అంటూ పరోక్షంగా ఒకరిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. దాంతో జైలుకి వెళ్లాల్సిన వాళ్లు ఎవరు? అనే ప్రశ్న ఇండ్రస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విష్ణు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నాడు. జైలు కెళ్లాల్సినవాళ్లు, ఊచలు లెక్కపెట్టాల్సిన వాళ్లు, మేం చెబితే బయటకు వచ్చినవాడు.. అంటూ ఒకరిపై.. పరోక్షంగా కామెంట్లు చేశాడు. ఇదంతా ప్రకాష్ రాజ్ గురించేనా? అన్న ప్రశ్న మొదలైందిప్పుడు. విష్ణు ప్రధాన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌నే కాబట్టి.. విష్ణు కామెంట్లు ప్రకాష్ రాజ్‌పైనే అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. మరి ప్రకాష్ రాజ్ ఎప్పుడుజైలుకి వెళ్లాల్సివచ్చిందో, ఆ సమయంలో విష్ణు ఎలా ఆదుకున్నాడో అన్న విషయాల్లో క్లారిటీ రావాలి.
పెద్దలు చెప్పిన మాట వింటా అని చెప్పిన విష్ణునే ఇప్పుడు టాలీవుడ్ కి పెద్ద దిక్కు అన్నదే లేకుండా పోయింది అనడం విడ్డూరంగా ఉంది. దాసరి లేని లోటు తీర్చడానికి చిరంజీవి అహోరాత్రులు కష్టపడుతుంటే, ఇండ్రస్ట్రీ బాధ్యత అంతా తన భుజాన వేసుకుంటుంటే.. విష్ణు పుసుక్కున ఆ మాట అనేయడం మెగా అభిమానులు నచ్చడం లేదు.