త్రివిక్రమ్ రచయితగా వచ్చి దర్శకుడిగా మారాడు. దర్శకుడయ్యాక... మరొకరి సినిమాకి సంభాషణలు రాయడం మానేశాడు. `తీన్ మార్`కి కేవలం పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇప్పుడు మరోసారి పవన్ కోసం.. పెన్ను పట్టుకుంటున్నాడని టాక్.
మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం `అయ్యప్పయుమ్ కోషీయమ్`. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడు. రెండో హీరోగా రానా ఫిక్సయ్యే అవకాశాలున్నాయి. సాగర్ చంద్ర దర్శకుడు. మలయాళ స్క్రిప్టుని తెలుగులో పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు భారీ మార్పులు చేస్తున్నారని సమాచారం. ఆ మార్పులు, చేర్పుల బాధ్యత త్రివిక్రమ్ కి అప్పగించారని తెలుస్తోంది. స్క్రిప్టుని పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్చడానికి, సంభాషణలు అందించడానికి త్రివిక్రమ్ కి ఏకంగా 10 కోట్లు చెల్లిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సితార అంటే త్రివిక్రమ్ సొంత సంస్థలాంటిది. ఈ సంస్థ నుంచి ఎంత పారితోషికం తీసుకున్నా... ఈ జేబులోంచి తీసి, ఆ జేబులో వేసుకోవడం లాంటిదే. సో.. 10 కోట్లూ.. అంతే. ఈ సినిమాకి త్రివిక్రమ్ ఎంత పారితోషికం తీసుకున్నా, ఫ్రీగా చేసినా.. ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయనకు వాటా ఉంటుందని అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆమాట ఎలా ఉన్నా... త్రివిక్రమ్ మాట సాయం చేస్తున్నాడంటే.. ఈ రీమేక్ స్థాయి అమాంతం పెరిగిపోవడం ఖాయం.