తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై బొమ్మ పడలేదింకా.! కరోనా లాక్‌డౌన్ నుంచి ఇచ్చిన వెసులుబాట్లలో సినిమా హాళ్ళు తెరిచేందుకు అనుమతి గతంలోనే వచ్చింది కేంద్రం నుంచి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా హాళ్ళు తెరిచే విషయమై గందరగోళం కొనసాగుతోంది. కాగా, డిసెంబర్‌లో విడుదలయ్యే సినిమాలపై ఇప్పుడిప్పుడే కాస్త క్లారిటీ వస్తోంది. ‘సోలో బతుకే సో బెటరు’ అంటున్నాడు సాయిధరవ్‌ు తేజ్. ఈ సుప్రీం హీరో సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. మరో మూడు సినిమాలు కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
కరోనా లాక్‌డౌన్ తర్వాత ది¸యేటర్లలో విడుదలయ్యే పెద్ద సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్న మాట వాస్తవం. అయితే, ఆడియన్స్ నుంచి మరీ అంతలా ఎదురుచూపులు కనిపించడంలేదనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఓటీటీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. దాంతో, సినిమా హాళ్ళకు తిరిగి ప్రేక్షకులు వస్తారా.? లేదా.? అన్న సందిగ్ధమైతే సినీ పెద్దల్లో వుంది.
సినిమా హాళ్ళు తెరిచి, కొత్త సినిమాలు విడుదల చేసి.. లాభాల్ని రాబట్టుకోగలమా.? అన్న అనుమానాల నడుమ, సినీ పరిశ్రమలో తీవ్ర గందరగోళమైతే కొనసాగుతోంది. ప్రేక్షకులు సినిమా ‘హాల్’ ఎక్స్‌పీరియన్స్‌ని వదులుకోరని రాజమౌళి లాంటి సినీ ప్రముఖులు చెబుతున్నారు. కానీ, ఓటీటీ పుణ్యమా అని ప్రతి ఇల్లూ ఓ మినీ సినిమా హాల్ అయిపోయింది. అవసరమైన ఎక్విప్‌మెంట్ సమకూర్చేసుకుంటున్నారు జనం. అందుకే, సినిమా హాల్ మూడ్ అనేది ఆడియన్స్‌లో కనిపించడంలేదు.