ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. `అరవింద సమేత వీర రాఘవ` తరవాత ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ చిత్రానికి `అయిననూ పోయిరావలె హస్తినకు` అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేశాడట. ఇటీవల ఎన్టీఆర్‌ని కలిసి తొలి సగం కథ, డైలాగులతో సహా వినిపించినట్టు టాక్. ఈ దసరాకి ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం.
నిజానికి 'ఆర్.ఆర్.ఆర్'తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. అది పూర్తయితే గానీ త్రివిక్రమ్‌తో జట్టు కట్టలేడు. అందుకే ఎన్టీఆర్‌తో సినిమా కంటే ముందు.. త్రివిక్రమ్ మరో సినిమాని పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ఎన్టీఆర్ మాత్రం `దసరాకి పట్టాలెక్కిద్దాం..' అని భరోసా ఇచ్చాడట. అందుకే.. త్రివిక్రమ్ కూడా దసరా వరకూ వేచి చూద్దామన్న నిర్ణయానికి వచ్చాడటని టాక్. దసరాకి సినిమా మొదలెట్టి, ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాల్ని పూర్తి చేస్తారు. 'ఆర్.ఆర్.ఆర్' పనులన్నీ అయ్యాక ఎన్టీఆర్ సెట్‌లోకి అడుగుపెడతాడు. అదీ... మేటరు.