కరోనా వల్ల... చిత్రసీమ కుదేలైపోయింది. మళ్లీ సినిమా పరిశ్రమ ఎప్పుడు తేరుకుంటుందో చెప్పలేం. బడ్జెట్లు తగ్గించుకోవడం, సినిమాని వీలైనంత తక్కువలో తీసుకోవడం మినహా మరో మార్గం లేదు. బడ్జెట్లు తగ్గాలంటే కాస్ట్ కటింగ్‌లు చేయాలి. అందులో భాగంగా పారితోషికాలు తగ్గించుకోవాలి. మరి.. అందుకు హీరోలు, డైరెక్టర్లూ రెడీయేనా? అన్నది ప్రశ్న. ఈ విషయంలో అందరికంటే త్రివిక్రమ్ ముందడుగు వేశాడని టాక్. తన కొత్త సినిమా కోసం పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడట. బడ్జెట్ అదుపులో పెట్టుకోవడానికే త్రివిక్రమ్ పారితోషికంలో స్వయంగా కోత విధించుకున్నాడని టాక్. ఎన్టీఆర్ కూడా పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అంటున్నాడట. ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే ఎన్టీఆర్ సొంత సంస్థే. హారిక హాసిని అంటే.. త్రివిక్రమ్ కీ సొంత బ్యానర్ లాంటిది. సొంత సంస్థల్లో పారితోషికాలు తగ్గించుకోవడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే.. లాభాలలో వాళ్లకు ఎలాగూ వాటా ఉంటుంది. బయటి సినిమాల్లోనూ ఇదే ఆలోచనతో పనిచేస్తే... నిర్మాతలకు మేలు జరుగుతుంది.