తెలుగులో హాస్య నటులు చాలా ఎక్కువ. ఎంత ఎక్కువంటే.. తెలుగులో ఉన్నంతమంది హాస్య నటులు ఇంకెక్కడా లేరు. అయితే వాళ్లలో మహిళల సంఖ్య చాలా తక్కువ. అప్పట్లో రమా ప్రభ, ఆ తరవాత శ్రీలక్ష్మి, మధ్యలో హేమ ఆలోటు తీర్చారు. ఇప్పుడైతే విద్యుల్లేఖారామన్ ఆ స్థానాన్ని కాస్తలో కాస్త భర్తీ చేస్తోంది. తెలుగు, తమిళం కలిసిన యాసలో నవ్విస్తూ, మెప్పిస్తోంది.
ఇటీవల విద్యుల్లేఖ.. బరువు తగ్గింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 16 కిలోల బరువు తగ్గి షాక్ ఇచ్చింది. అయితే బరువు తగ్గడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయట్ట. ``ఎప్పటి నుంచో బరువు తగ్గాలని అనుకుంటూ వచ్చాను. డాక్టర్లు కూడా అనారోగ్య సమస్యల దృష్ట్యా బరువు తగ్గాల్సిందే అన్నారు. కానీ కుదర్లేదు. ఈ లాక్ డౌన్ సమయంలో బరువు తగ్గడంపై దృష్టి పెట్టా. ఇప్పుడు దాన్ని సాధించా`` అన్నారు. కాలేజీ రోజుల్లో తాను కూడా బాడీ షేమింగ్ ని ఎదుర్కొందట. తనని చూసి చాలామంది ఎగతాళి చేసేవారని, తన బరువుపై జోకులు వేసుకునే వారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా ''లావుగా ఉన్నప్పుడే బాగున్నావు'' అంటున్నార్ట. అది కూడా ఓరకమైన బాడీ షేమింగే అంటోంది విద్యల్లేఖ. తన చేతిలో చాలా సినిమాలున్నాయని, ఇప్పుడు మరిన్ని మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ.