జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్‌లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ అయిపోయింది. వీరిద్దరూ కలిస్తే అద్భుతమే అని అభిమానులు ఫిక్సయిపోయారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే... అజ్ఞాతవాసి లెక్క తప్పింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం పవన్ అభిమానులకు ఇప్పటికీ మింగుడు పడని విషయం. పవన్ కెరీర్‌లోనే కాదు, త్రివిక్రమ్ జీవితంలోనూ ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది. త్రివిక్రమ్ కావాలనే ఈసినిమాని ఫ్లాప్ చేశాడని అప్పట్లో ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. అజ్ఞాతవాసి తరవాత పవన్ - త్రివిక్రమ్ ఓ సినిమా చేద్దామనుకున్నారు. ఆ సినిమా ఆగిపోవడానికి ప్రత్యక్ష కారణంగా మిగిలింది...ఈ ఫ్లాప్.
ఇప్పుడు చాలా కాలం తరవాత.. పవన్ - త్రివిక్రమ్ మళ్లీ కలిశారు. `భీమ్లా నాయక్` కోసం. ఈసినిమాకి సాగర్ చంద్ర దర్శకుడే అయినా, తెర వెనుక అంతా తానై నడిపించాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చాడు. సెట్లో కూడా త్రివిక్రమ్ హవానే నడిచిందని, సాగర్ ని పక్కన పెట్టి, డైరెక్షన్ కూడా చేశాడని గుసగుసలు వినిపించాయి. ఈసినిమా ఎలాగైనా హిట్ చేయాలన్న కసి త్రివిక్రమ్ లో కనిపించిందని, హిట్ కొట్టి, అజ్ఞాతవాసి లెక్క సరిచేయాలన్న తపనతో త్రివిక్రమ్ పని చేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనూ త్రివిక్రమ్ మాట్లాడకపోవడానికి కారణం ఇదే. హిట్టు కొట్టాకే నోరు విప్పాలని త్రివిక్రమ్ గట్టిగా డిసైడ్ అయ్యాడని, అందుకే థ్యాంక్స్ మీట్ వరకూ తాను మాట్లాడలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా హిట్ చేసి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి సరైన ట్రీట్ ఇచ్చాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి మచ్చ... తొలగిపోయినట్టే.