త్రివిక్రమ్ - సునీల్ మంచి స్నేహితులన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో,రాసిన కథల్లో సునీల్‌కి మంచి పాత్రలు దక్కాయి. ఓ రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ సృష్టించిన పాత్రల వల్లే..కమెడియన్ గా సునీల్ నిలవగలిగాడు. మధ్యలో సునీల్ హీరో అయిపోవడం వల్ల కాస్త బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్నాడు సునీల్. దాంతో త్రివిక్రమ్ సినిమాల్లో పాత్రలు దక్కతున్నాయి. అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల్లో సునీల్ కమెడియన్ గా కనిపించాడు.
ఇప్పుడు `భీమ్లా నాయక్`లో కూడా మెరిశాడు. ఓ పాటలో. `లాలా.. భీమ్లా` లో సునీల్ కనిపించాడు. సునీల్ చూడగానే ఫ్యాన్స్ షాకయ్యారు. `ఏంటి.. ఈ సినిమాలో సునీల్ కూడా ఉన్నాడా? ఇంత వరకూ చెప్పలేదే` అని. కానీ సునీల్ కనిపించింది ఆ ఒక్క పాటలోనే. అది కూడా కొన్ని ఫ్రేముల్లో మాత్రమే. ఈ మాత్రం చిన్న బిట్ కి సునీల్ ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదు. త్రివిక్రమ్ సినిమా కదా, ఒక్క ఫ్రేమ్‌లో అయినా కనిపించాలని సునీల్ అనుకున్నాడా? లేదంటే సునీల్ ని పెట్టకపోతే సెంటిమెంట్ గా వర్కవుట్ కాదని త్రివిక్రమ్ భావించాడా? అనేది అర్థం కావడం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా, ఇలా ఊరూ పేరూ లేకుండా చిన్న చిన్న పాత్రల్లో నటించడం సునీల్ స్థాయికి సరి కాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.