`అల.. వైకుంఠపురములో` తరవాత త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. కనీసం సెట్స్ పైకి కూడా వెళ్లలేదు. మహేష్ బాబుతో సినిమా చేయాల్సివుంది. అది త్వరలోనే పట్టాలెక్కుతుంది. ఈ గ్యాప్ మళ్లీ మళ్లీ రాకూడదని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందుకే ఇక పై వరుసగా సినిమాలు చేయాలని ఫిక్సయ్యాడట. అందులో భాగంగా మహేష్ సినిమాతో పాటుగా మరో రెండు స్క్రిప్టుల్ని కూడా రెడీ చేసుకొన్నాడని టాలీవుడ్ టాక్. అందులో ఒకటి ఎన్టీఆర్ కోసం.. మరోటి బన్నీ కోసం.
త్రివిక్రమ్ - బన్నీలది సూపర్ హిట్ కాంబో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశారు వీరు. ఎన్టీఆర్‌ని `అరవింద సమేత వీర రాఘవ` గా చూపించి ఓ సూపర్ హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లతో మరోసారి పనిచేయబోతున్నాడన్నమాట. మహేష్ తో సినిమా అవ్వగానే... ఎన్టీఆర్ తో గానీ, బన్నీతో గానీ ఓ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడట. అప్పటికి ఎవరు అందుబాటులో ఉంటే, వాళ్లతో కాంబో ఫైనల్ అవుతుందని సమాచారం. పుష్ప 2 అవ్వగానే బోయపాటి శ్రీనుతో బన్నీ వర్క్ చేయాల్సివుంది. ఎన్టీఆర్ చేతిలోనూ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మరి వాటిలో ఏది ముందు.. ఏది వెనుక అనేది తెలియాల్సివుంది.