‘మా సినిమాని వెండితెర మీదనే విడుదల చేస్తాం. ఓటీటీలో ముందుగా రిలీజ్ చేయడం కుదరదు..’ అంటూ ‘ఒరేయ్ బుజ్జిగా’ టీమ్, ‘వి’ టీమ్ ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఆయా సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద విడుదల కాబోతున్నాయంటూ ప్రచారం జరిగిన దరిమిలా, ఆ చిత్రాల దర్శక నిర్మాతలు స్పందించాల్సి వచ్చింది. అయితే, తమిళ సినిమా పరిస్థితి కాస్త భిన్నంగా కన్పిస్తోంది. ఇప్పట్లో మళ్ళీ సినిమా దియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వైపు చూస్తున్నాయట. భారీ ఆఫర్లతో ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిర్వాహకులు ముందుకొస్తుండడంతో, ఆ ఛాన్స్ వదులుకోకూడదని కొందరు నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరు నాటికే కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై దర్శనమివ్వబోతున్నాయంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ లిస్ట్‌లో చిన్న సినిమాలు మాత్రమే కాదు, ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు కూడా వుండబోతున్నాయట. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 20 తర్వాత సినిమా రిలీజ్‌లు జరగలేదు. మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే అవకాశం వుండదనీ, కేవలం సడలింపులు మాత్రమే వుంటాయనీ, ఈ నేపథ్యంలో ఇప్పుడు తొందరపడకపోతే ఇంకా నష్టపోతామనే భావనతో ఆ చిత్రాల నిర్మాతలు వున్నారట. తమిళ సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో, కొందరు తెలుగు సినీ నిర్మాతలూ ఆ దిశగా ఆలోచన చేయక తప్పడంలేదనేది తాజా ఖబర్.