థియేటర్లు మూతపడి వంద రోజులు దాటేసింది. సెప్టెంబరు - అక్టోబరు వరకూ థియేటర్లని తెరిచే అవకాశమే లేదని విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. కొంతమందైతే 2020పైనే ఆశలు వదిలేసుకోవాలని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే - థియేటర్లకి వెళ్లి, కొత్త సినిమా చూడడం ఇప్పట్లో కష్టమే అనిపిస్తోంది. దాంతో... చిత్రసీమలో మరింత గుబులు పట్టుకుంది.
అయితే మధ్యేమార్గంగా ఓటీటీ ఓ వరంలా కనిపిస్తోంది. చిన్నా, చితకా, మీడియం రేంజు సినిమాలకు ఓటీటీ ఓ కల్ప తరువులా మారుతోంది. పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీకి సినిమాల్ని అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదు. నిశ్శబ్దం, రెడ్, ఉప్పెన, వీ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఒరేయ్ బుజ్జిగా, ఈ సినిమాలన్నీ ఎప్పుడో రెడీ అయిపోయాయి. థియేటర్లు తెరచుకుంటే, విడుదల తేదీ ప్రకటించుకోవాలని భావిస్తున్నాయి. కానీ... థియేటర్లు తెరచే పరిస్థితి లేదు. మొన్నటి వరకూ `ఓటీటీకి సినిమాని అమ్మం` అన్నవాళ్లంతా ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడ్డారు.
నిశ్శబ్దం ముందు నుంచీ ఓటీటీలోనే విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. నిర్మాతలు ఆ వార్తల్ని ఖండించారు కూడా. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తోందని టాక్. వి సినిమాకీ మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ ఈ సినిమాని ఓటీటీకి అమ్మడానికి నిర్మాత దిల్ రాజు ఒప్పుకోలేదు. అయితే పూర్తయిన సినిమాని ఎంత కాలం అలా దాచుకుంటారు? అందుకే అడిగిన రేటు ఇస్తే - తమ సినిమాని ఓటీటీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ దిల్ రాజు సంకేతాలు పంపార్ట. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలు ఇప్పటికే ఓటీటీలతో బేరాలు కుదుర్చుకున్నాయని టాక్. ఉప్పెన కి దాదాపు 25 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఆసినిమా ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. థియేటర్లలోనే విడుదల అవ్వాలి. మరో 10 సినిమాలు ఓటీటీ విడుదలకు ఎదురు చూస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈజాబితాలో ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి.