కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా 'కబ్జా'. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 'బ్రహ్మ', 'ఐ లవ్యూ' చిత్రాల తర్వాత ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుండి 1980 మధ్య కాలంలో సాగే కథతో, అండర్‌వరల్డ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఏడు భాషల్లో పాన్ ఇండియన్ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగులో సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఆనాటి బైక్ మీద ఉపేంద్ర లుక్ రాయల్‌గా ఉందని, ఫస్ట్ లుక్‌లో రెట్రో ఫీల్ ఉందని ఉప్పి అభిమానులతో పాటు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
'ఎ', 'రా'... ఇలా వైవిధ్యమైన, విలక్షణ కథలతో ఉపేంద్ర పాత్ బ్రేకింగ్ మూవీస్ చేశారు. కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. మాఫియా నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో 'కబ్జా' విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఆర్. చంద్రు మాట్లాడుతూ "తెలుగు ప్రేక్షకుల నుండి 'కబ్జా' ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుత స్పందన రావడం సంతోషంగా ఉంది. సినిమాకూ అదే స్థాయిలో స్పందన వస్తుందని నమ్ముతున్నా. హీరో క్యారెక్టరైజేషన్, అందులో ఉపేంద్రగారి నటన, కథ సినిమాకి హైలైట్ అవుతాయి. ఇప్పటికి సుమారు 30 శాతం సినిమా పూర్తయింది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణకు విరామం ఇచ్చాం. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని, అందరూ చిత్రీకరణలు ప్రారంభించిన తర్వాత మేం కూడా చిత్రీకరణ ప్రారంభిస్తాం. సుమారు 70 నుండి 80 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఏడు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం. జగపతిబాబుగారు సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర సరసన అగ్ర హీరోయిన్ నటిస్తారు. ఆవిడ ఎవరనేది త్వరలో చెబుతాం" అని అన్నారు.