అప్సెట్ 'స్పైడర్'
బాహుబలి2, ఖైదీ నెంబర్ 150 తర్వాత 2017లో అత్యంత అంచనాలు ఏర్పరుచుకున్న సినిమా మహేష్ బాబు స్పైడర్. సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ దర్శకుడు మురగదాస్, సంతోష్ శివన్ కెమెరా, మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా... ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ స్పైడర్. ఐతే అంతే భారీ నిరాశ పారించింది. మాహేష్ బాబు అభిమానులే ఈ సినిమాపై పెదవి విరిచారు. దర్శకుడు మురగదాస్ ను ఆడిపోసుకుంటున్నారు. ‘మా సూపర్ స్టార్ ని ఒక సెల్ ఫోన్, కూర్చికి కట్టేసి .. ఏం గొప్ప ‘సైకో’ సినిమా తీశాడు” అంటూ నిట్టూర్చారు. నిజమే.. రమణ, కత్తి, గజనీ, తుపాకి.. లాంటి యూనివర్షల్ కధలను హ్యాండిల్ చేసిన మురగదాస్.. ఒక సైకోకి బిల్డప్ ఇస్తూ మహేష్ బాబుని కూర్చికి పరిమితం చేసి అసలు డెప్త్ లేని కథను రాసుకున్నాడు. బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ తర్వాత మహేష్ నుండి వచ్చిన స్పైడర్ పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. బ్రహ్మోత్సవంలో జరిగిన తప్పు జరగదని, కధ విషయంలో మహేష్ మరింత జాగ్రత్తపడివుంటాడని అనుకున్నారంత. కానీ మహేష్ మళ్ళీ కధ విషయంలో విఫలమయ్యాడు. తన నుండి ప్రేక్షకులు ఎలాంటి కథను కోరుకుంటుంన్నారో తెలుసుకోవడంలో మళ్ళీ తడబడ్డాడు. వెరసి.. స్పైడర్ తో ప్రేక్షకులను అప్సెట్ చేశాడు మహేష్.
సర్‌ప్రైజ్ 'గరుడవేగ' ఇదే
చిత్రసీమ అంటే చిత్ర విచిత్రాలకు నెలవు. హిట్ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్ అవ్వడం, అసలేమాత్రం అంచనాలు లేని సినిమాలు సూపర్ హిట్లు కావడం మామూలే. 2017లో అంచనాలు తలక్రిందులు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆశలు పెంచుకున్న `స్పైడర్` అట్టర్ ఫ్లాప్ అయితే... ఏమాత్రం ఆశలు లేకుండా వచ్చిన `గరుడవేగ` సూపర్ హిట్ అయ్యింది. 2017లో సర్‌ప్రైజ్ ఇచ్చిన సినిమా ఇదే. రాజశేఖర్ - ప్రవీణ్ సత్తారు కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ముందు నుంచీ ఎవరికీ అంచనాల్లేవు. పైగా టైటిల్ కూడా.. క్యాచీగా పెట్టలేదు. దానికి తోడు షూటింగ్ దశలోనే.. పడుతూ లేస్తూ వచ్చింది. బడ్జెట్ హెవీ అయిపోవడం, రాజశేఖర్ పై రూ.25 కోట్లు పెట్టడం తో ఈ సినిమాపై అనుమానాలు తీవ్రతరం అయ్యాయి. సన్నీలియోన్‌ని తీసుకురావడం కేవలం హైప్ కోసమే అనుకున్నారు. కానీ... టీజర్, ట్రైలర్ చూశాక ఈ సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడడం మొదలైంది. ఇందులో ఏదో విషయం ఉంది.. అనుకున్నారంతా. రాజశేఖర్ స్పీచులు, తనలోని కాన్ఫిడెన్స్ చూసి... మెల్లమెల్లగా ఈ సినిమాపై నమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. సినిమా విడుదలై... అందరికీ షాక్ ఇచ్చింది. రాజశేఖర్ కమ్ బ్యాక్ సినిమా ఇదే.. అన్నారంతా. కథనంలో వైవిధ్యం, హాలీవుడ్ తరహా మేకింగ్ ఇవన్నీ విమర్శకులకు నచ్చాయి. ప్రేక్షకులూ ఆదరించారు. ఓపెనింగ్స్ కాస్త డల్‌గా ఉన్నా.. మెల్లగా పుంజుకున్నాయి. తెలుగు శాటిలైట్ రూ.4 కోట్ల వరకూ పలికింది. సన్నీ వల్ల హిందీలోనూ 2.5 కోట్లకు ఈ సినిమాని కొన్నారు. మొత్తానికి రూ.25 కోట్ల బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకుంది. హీరోగా రాజశేఖర్ ని నిలబెట్టడమే కాదు, ప్రవీణ్ సత్తారు పై పెద్ద హీరోల దృష్టి పడడానికి ఈ సినిమా దోహదం చేసింది.