ఈ సీజన్‌లో సినిమాల తాకిడి ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రతీ వారం... మూకమ్మడిగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వారానికి నాలుగైదు సినిమాలైతే గ్యారెంటీ. గత వారమైతే ఏకంగా పది సినిమాలొచ్చాయి. వాటిలో కొన్ని సినిమాల పేర్లు కూడా సగటు సినీ అభిమానులకు తెలీదనుకోండి. అది వేరే విషయం. ఈ వారమైతే `ఊర్వశివో రాక్షసివో`, `బనారస్`, `లైక్ షేర్ సబ్‌స్క్రైబ్` లాంటి కాస్తో కూస్తో పేరున్న సినిమాలు విడుదలయ్యాయి. వాటి ప్రచారం కూడా బాగానే చేశారు. `బనారస్`, `లైక్ షేర్ సబ్‌స్క్రైబ్` అయితే డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. `ఊర్వశివో..`కి మంచి టాక్ వినిపించింది. రివ్యూలూ బాగానే వచ్చాయి. కానీ ఏం లాభం..? ఈ సినిమాకి వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఏ థియేటర్ చూసినా పట్టుమని పదిమంది కూడా కనిపించడం లేదు. కొన్ని ఏరియాల్లో కాంతార వసూళ్లే ఇంకా బెటర్‌గా ఉన్నాయి. దాన్ని బట్టి.... ఊర్వశివో.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అల్లు శిరీష్‌పై నమ్మకాలు ఎవరికీ లేవు. సినిమాకి మంచి రివ్యూలు వచ్చినా జనాలు శిరీష్‌ని చూడ్డానికి థియేటర్లకు వెళ్లడం లేదు. అను ఇమ్మానియేల్ ని తీసుకొచ్చినా, రొమాంటిక్ సీన్లు జొప్పించినా.. వాటి కోసమైనా యూత్ థియేటర్లకు వెళ్లలేదు. నిజానికి ప్రేక్షకుల మూడే విచిత్రంగా ఉంది. ఏ సినిమాని చూస్తారో, ఏది పక్కన పెడతారో చెప్పలేని పరిస్థితి. మొన్నటికి మొన్న `గాడ్ ఫాదర్` పరిస్థితీ ఇంతే. మంచి టాక్ వచ్చింది. కానీ.. వసూళ్లలో నిలకడ లోపించింది. ఫైనల్ రన్‌లో ఈసినిమా ఫ్లాప్ గా తేలింది. ఇప్పుడు శిరీష్ పరిస్థితి కూడా ఇంతే కావొచ్చు.