అర్జున్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ కథానాయకుడిగా రూపొందాల్సిన చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. కారణాలు ఏమైనా సరే... ఈ కాంబో ఇప్పుడు పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అలాగని అర్జున్ ఈ సినిమాని పూర్తిగా ఆపేయడం లేదు. విశ్వక్‌సేన్ స్థానంలో మరో హీరో తీసుకొని, పట్టాలెక్కించాలన్నది ఆయన ప్రయత్నం. అందుకు తగిన ప్రయత్నాలూ మొదలైపోయాయి. ఇప్పుడు అర్జున్‌కి అర్జెంటుగా ఓ యువ హీరో కావాలి. విశ్వక్ స్థానాన్ని ఏ హీరోతో భర్తీ చేయాలా? అంటూ అర్జున్ మల్లగుల్లాలు పడుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా మొదలు కావాల్సింది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అడ్వాన్సులు ఇచ్చేశాడు అర్జున్. లొకేషన్లు కూడా బ్లాక్ అయిపోయాయి. డేట్లు ఫిక్సయ్యాయి. హీరో మాత్రం లేడు. ఈ సినిమా ఆగిపోతే అర్జున్‌కి భారీ నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమాని పునః ప్రారంభించాలని అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే కొంతమంది యంగ్ హీరోలతో అర్జున్ టచ్‌లోకి వెళ్లాడని సమాచారం.
కాకపోతే.. యూత్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు అర్జున్ తో సినిమా చేయడం కష్టం. అలాగని సినిమాని వాయిదా వేస్తే.. అర్జున్ తీవ్ర నష్టాలకు గురి కావల్సి ఉంటుంది. కొత్త వాళ్లతో ఈ సినిమా చేయడానికి కూడా వీలు లేదు. అందుకే మధ్యే మార్గంగా తమిళం నుంచి గానీ, కన్నడ నుంచి గానీ ఓ హీరోని దిగుమతి చేసుకోవాలని అర్జున్ భావిస్తున్నట్టు టాక్.