నేచురల్ స్టార్ నాని... తన రూటు మార్చాడు. ఇప్పటి వరకూ ది బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు అందించిన నాని... తొలిసారి విలన్ పాత్ర పోషించాడు. అట్టాంటిట్టాంటి విలన్ కాదు. తన సైకో విలనిజాన్ని బయట పెట్టాడు. `వి` సినిమాలో. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దిల్ రాజు నిర్మాత. సుధీర్ బాబు మరో కథానాయకుడు. నివేదా దామస్, అతిథిరావు హైదరీ కథానాయికలు. ఈ సినిమా వచ్చే నెల 5న అమేజాన్ లో విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
ట్రైలర్ నిజంగా షాకింగ్ గా ఉంది. అటు నాని స్టైల్ లో గానీ, ఇటు ఇంద్రగంటి గత సినిమాల ఛాయల్లో గానీ.. ఈ సినిమా ఉండడం లేదని ట్రైలర్ చూసి చెప్పేయొచ్చు. ఓ సైకోకీ, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కీ మధ్య జరిగే కథ ఇది. వాళ్లు వేసుకునే ఎత్తుకు పై ఎత్తులు, సైకో చేసే అరాచకాలు, వాటిని అడ్డుకోవడానికి పోలీస్ చేసే సాహసాలతో ఈ సినిమా ఆధ్యంతం ఆసక్తిగా సాగబోతోందని అర్థమౌతోంది. నాని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాయి. మేకింగ్ కూడా చాలా స్టైలీష్ గా ఉంది. సాధారణంగా నాని, ఇంద్రగంటి సినిమాలంటే.. వినోదాత్మకంగా, కుటుంబ ప్రేక్షకులంతా చూసేలా ఉంటాయి. కానీ ఈసారి యాక్షన్, థ్రిల్లర్ ప్రియుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటి వరకూ `వి`పై ఉన్న అంచనాల్ని ఈ ట్రైలర్ పూర్తిగా రెట్టింపు చేసింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.