క్రిష్ కు మంచి అభిరుచిగల దర్శకుడనే పేరుంది. క్రిష్ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేయనప్పటికీ అర్థవంతమైన కథాంశాలు ఎంచుకోవడం క్రిష్ కు ఒక ప్రత్యేకత తీసుకువచ్చింది. ముఖ్యంగా 'గమ్యం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె' లాంటి సినిమాలు క్రిష్ అభిరుచిని తెలియజేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్రిష్ తన సినిమాలకు పుస్తకాల నుంచి ప్రేరణ పొందుతాడని విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.
క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన 'కొండపొలం' అనే నవల ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ నవలకు అవార్డులు కూడా వచ్చాయట. అయితే ఈ నవలను క్రిష్ మూలంగా తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా స్క్రిప్ట్ రూపొందించారు. ఇదిలా ఉంటే క్రిష్ ఒక పుస్తకాల పురుగు విపరీతంగా పుస్తకాలు చదువుతుంటారు. అందులో ఏదో ఒక పుస్తకం నుంచి ప్రేరణ తీసుకొని ఒక కథ తయారుచేసుకుంటారు. ఒకవేళ ఏదో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని కథ అల్లుకుంటే మాత్రం ప్రేరణ గురించి పెద్దగా ప్రస్తావించరు. అదే ఒక పుస్తకం ఆధారంగా సినిమాను డైరెక్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పుస్తకం గురించి ప్రస్తావిస్తారు.
చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక విషయం ఏంటంటే క్రిష్ కెరీర్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం 'గమ్యం' సినిమాకు ఒక ఇంగ్లీష్ పుస్తకం ప్రేరణగా నిలిచింది. ఆ పుస్తకం పేరు 'జెన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్'. రాబర్ట్ ఎం సిర్సిగ్ రాసిన ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్. క్రిష్ ఇతర సినిమాలు పరిశీలించినా ఇలా ఏదో ఒక పుస్తకం నుంచి ప్రేరణ పొందిన విషయం అర్థం అవుతుంది.