‘ఈ సినిమాలో కమర్షియాలిటీకి అవకాశమే లేదు. సౌత్‌లో అస్సలు వర్కవుట్ అయ్యే సినిమా కాదు. ఈ సినిమాని సెలక్ట్ చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమే..’ అంటూ తమిళ హీరో అజిత్ విషయంలో అతని అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. కానీ, తమిళంలోనూ ‘పింక్’ రీమేక్ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమానే తెలుగులోకి రీమేక్ చేస్తే, అదొక దండగ వ్యవహారం.. తెలుగు ఆడియన్స్ టేస్ట్ వేరు.. అని చాలామంది మొదట్లో అనుకున్నారు.
కానీ, పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా ‘పింక్’ రీమేక్‌ని ఎంచుకున్నారు. అలా ‘వకీల్‌సాబ్’ పట్టాలెక్కింది. అయితే, ‘వకీల్‌సాబ్’ స్టిల్స్ చూసి, పవన్ కళ్యాన్ గెటప్ చూసి.. ఇందులో ఏం కమర్షియాలిటీని ఆశించగలం.? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది అభిమానుల్లో కూడా. కానీ, ఇప్పుడు అందరి అభిప్రాయాలూ మారిపోయాయి. అందుక్కారణం ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి వస్తోన్న తాజా స్టిల్స్.
వ్యూహాత్మకంగా ఈ సినిమా స్టిల్స్ లీక్ అవుతున్నాయా? అన్న అనుమానాలు ఓ పక్క వున్నా, దాన్నెవరూ ఇప్పుడు పట్టించుకోవడంలేదు. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. పవన్ ఈ సినిమా ఎందుకు చేస్తున్నారన్నదానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ ఈ సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్‌గా వున్నారో మరింత క్లారిటీ వచ్చేస్తోంది అభిమానులకి. ఇక, సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి.