వకీల్ సాబ్ విడుదల కోసం పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ లేకపోతే.. ఎప్పుడో ఈ సినిమా వచ్చేసేది. `వకీల్ సాబ్` కి సంబంధించి మరో 25 శాతం షూటింగ్ బాకీ ఉంది. అది వీలైనంత త్వరగా పూర్తి చేస్తే తప్ప , పవన్ చేతిలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులకు మార్గం సుగమం అవ్వదు. అందుకే `వకీల్ సాబ్` షూటింగ్ త్వరగా పూర్తి చేస్తారని అనుకున్నారు. అయితే దిల్ రాజు ప్లానింగ్ వేరేలా ఉంది. ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం.
సంక్రాంతికి అంటే చాలా సమయం ఉంది. అందుకే దిల్ రాజు తొందర పడడం లేదు. పవన్ గెటప్ చూస్తే.. షూటింగులకు సిద్ధమైనట్టు కనిపించడం లేదు. అందుకే `వకీల్ సాబ్` సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకొంత సమయం పట్టేలానే కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలైనా, పవన్ సెట్ కి రాడని తెలుస్తోంది. మరోవైపు `వకీల్ సాబ్`షూటింగ్ కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదని క్రిష్ భావిస్తున్నాడు. పవన్ ఫ్రీ అయితే.. క్రిష్ సినిమా ని మొదలెట్టేయాలి. కానీ క్రిష్ మాత్రం వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. అందుకే.. వకీల్ సాబ్ పూర్తయ్యేలోగా.. తన సినిమాని ఫినిష్ చేసుకోవాలని క్రిష్ భావిస్తున్నాడు. వకీల్ సాబ్ లేట్ అవ్వడం క్రిష్‌కీ ఓ రకంగా లాభదాయకమే. కాకపోతే.. పవన్ కి అడ్వాన్సులు ఇచ్చిన మైత్రీ మూవీస్, రామ్ తాళ్లూరిలు మాత్రం పవన్ చేతిలోని సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూస్తున్నారు.