బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం `పింక్`. తమిళంలో అజిత్ తో రీమేక్ చేస్తే అక్కడ హిట్ అయ్యింది. తెలుగులో `వకీల్ సాబ్` గా పునః నిర్మిస్తే.. ఇక్కడా అదే ఫలితం. మూడేళ్ల గ్యాప్ వచ్చినా తనలో స్టామినా ఏమీ తగ్గలేదని, ఈసినిమాతో పవన్ నిరూపించుకున్నాడు. అయితే.. ఇప్పుడు `వకీల్ సాబ్` కి సీక్వెల్ వస్తుందన్న వార్తలు టాలీవుడ్ చుట్టూ షికారు చేస్తున్నాయి. ఈ సీక్వెల్ రావడానికి గల కారణాలూ చెప్పేస్తున్నారు గాసిప్ రాయుళ్లు.
వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పనితనం.. పవన్ కి బాగా నచ్చిందని, తనకు మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడన్నది టాలీవుడ్ టాక్. పైగా దిల్ రాజు కూడా `నేను పవన్ తో మరో సినిమా చేస్తున్నా` అని ప్రకటించేశాడు. కాబట్టి... ఇది వకీల్ సాబ్ కి సీక్వెలే అనేది సినీ జనాల మాట. కాకపోతే... బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ కి గానీ, తమిళంలో రీమేక్ చేసిన అజిత్ సినిమాకి గానీ సీక్వెల్ రాలేదు. నిజానికి వకీల్ సాబ్ లో సీక్వెల్ చేయదగిన పాయింట్ లేదు. సీక్వెల్ చేసినా.. జనం చూడలేరు.
పవన్ అంటేనే కమర్షియల్ హంగులు. వాటికి పింక్ కథలో ఇరికించడానికే చిత్రబృందం చాలా కష్టపడింది. ఇప్పుడు మరోసారి ఆ రిస్క్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయరు. వేణు శ్రీరామ్ తో పవన్ సినిమా ఉంటుంది.కానీ ఇప్పుడు కాదు. దానికి చాలా సమయం ఉంది. పైగా.. అది పింక్ రీమేక్ కానే కాదు. వేణు దగ్గర చాలా కథలు రెడీగా ఉన్నాయి. వాటిలో ఒకటి.. పవన్ సెలెక్ట్ చేసే అవకాశం ఉంది.