పవన్ కల్యాణ్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఈరోజే వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ... ఒకటే టాక్. `పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ సినిమా అదిరిపోయింది` అని. ఈ సినిమాతో పవన్ గట్టి హిట్ కొట్టినట్టే అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పేస్తున్నారు.
అయితే వకీల్ సాబ్ జోరుకి ఆంధ్రాలో కళ్లాలు పడ్డాయి. అక్కడ బెనిఫిట్ షోలు చాలా చోట్ల పడలేదు. అదనపు ఆటలకు అనుమతులు ఇవ్వలేదు. అంతే కాదు.. టికెట్ రేట్లని పెంచుకోవడానికి సైతం ప్రభుత్వం `నో` చెప్పింది. ఇది వరకు లేని రూల్స్ `వకీల్ సాబ్` కోసమే తీసుకొచ్చి, ఈ సినిమాని పరోక్షంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ `జనసేన` పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆయన వైకాపాకి వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ ప్రభుత్వం పవన్ పై పరోక్షంగా కక్ష సాధింపు చర్యలకు దిగిందని పవన్ అభిమానులు మండి పడుతున్నారు. తెలంగాణలో అదనపు ఆటలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చినా, ఆంధ్రాలో రాలేదు. వకీల్ సాబ్ రికార్డు వసూళ్లకు ఇది ఆటకం కలిగించే విషయమే.