రచయితలు దర్శకులుగా మారడం మామూలు విషయమే. కానీ.. నిలదొక్కుకున్నవాళ్లే అరుదు. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలకు కథని అందించిన వక్కంతం వంశీదీ ఇదే పరిస్థితి. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు కథ అందించారు వక్కంతం. టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన రైటర్స్‌లో తానొకరు. కానీ మెగా ఫోన్ పడితే కలసి రాలేదు. తొలి సినిమా `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా` ఫ్లాప్ అయ్యింది. బన్నీ లాంటి హీరో దొరికినా, సరిగా వాడుకోలేకపోయాడన్న అపవాదు మోయాల్సివచ్చింది. అందుకే వక్కంతం చాలా గ్యాప్ తీసుకొన్నాడు. ఇప్పుడు తన రెండో ప్రయత్నం.. మొదలెట్టారు. నితిన్ హీరోగా ఓ సినిమాకి శ్రీకారం చుట్టారు వంశీ. నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయిన.. శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆదివారం ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు.
ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని సమాచారం. నితిన్‌ని కొత్తగా చూపించేలా కథ, కథనాలు సిద్ధం చేశారట వంశీ. నిజానికి ఈ సినిమా మరో నిర్మాత చేయాల్సింది. కానీ.. కథపై విపరీతమైన నమ్మకంతో.. నితిన్ ఈ సినిమాని తన బ్యానర్‌లోనే చేయాలని ఫిక్సయ్యాడు. టెక్నికల్ గానూ ఈ సినిమా కోసం స్ట్రాంగ్ టీమ్ ని ఇచ్చాడు. హరీశ్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `జూనియర్` అనే టైటిల్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్టు సమాచారం. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో అయినా.. వంశీ హిట్టు కొడతాడేమో చూడాలి.