టైటిల్ రిలీజ్ చేసిన నాటి నుండీ 'వాల్మీకి' వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమ మనోభావాలు దెబ్బ తినేలా ఈ సినిమా టైటిల్ ఉందంటూ బోయ కులస్థులు ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, 'వాల్మీకి' మహర్షి గౌరవానికి ఏమాత్రం భంగం కలిగేలా తమ సినిమా ఉండబోదనీ, ఎవరి మనోభావాలు దెబ్బ తినేలా ఉండదనీ చిత్ర యూనిట్ నొక్కి వక్కాణిస్తూ వచ్చింది. టైటిల్ మార్చేది లేదని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, ఎట్టకేలకు టైటిల్ మార్చక తప్పలేదు. టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆందోళన కారులు రెండు జిల్లాల్లో 'వాల్మీకి' సినిమాపై నిషేధం విధించారు.
దాంతో హరీష్ శంకర్ అండ్ టీమ్ దిగి రాక తప్పలేదు. ఈ రోజు సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, రాత్రి 10 గంటల ప్రాంతంలో 'వాల్మీకి' టీమ్ టైటిల్ మారుస్తున్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఎన్నో డబ్బులు పెట్టి సినిమాని కొనుక్కున్న ఆ రెండు జిల్లాల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా హరీష్ శంకర్ తెలుపుతూ టైటిల్ మార్చాల్సి వచ్చినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై 'వాల్మీకి' టైటిల్ 'గద్దలకొండ గణేష్'గా పరిగణించబడుతుంది.. అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇకపై 'గద్దలకొండ గణేష్' టైటిల్‌తోనే జరుగుతాయని హరీష్ శంకర్ తెలిపారు.