'వాల్మీకి' టైటిల్ అనౌన్స్ అయిన నాటి నుండీ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. తమ మనోభావాల్ని కించపరిచేలా ఉందంటూ, 'వాల్మీకి' టైటిల్‌పై బోయ హక్కుల సంఘం వివాదానికి దిగింది. ఈ వివాదం నేపథ్యంలో కోర్టులో కేసు ఫైల్ చేశారు. తాజాగా విచారణ జరిపిన కోర్టు 'వాల్మీకి' టీమ్‌కి నోటీసులు పంపించింది. వరుణ్ తేజ్‌తో సహా, సెన్సార్ బోర్డ్‌కి కూడా నోటీసులు వెళ్లాయి.
పూర్తి విచారణ జరిపిన పిమ్మట నాలుగు వారాల తర్వాత కేసు ఓ కొలిక్కి రానుందనీ తెలుస్తోంది. ఈ తరుణంలో 'వాల్మీకి' సినిమా విడుదలపై అనుమానాలు కలుగుతున్నాయి. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వివాదాల నేపథ్యంలో సినిమా విడుదలపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందా.? అని మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 'వాల్మీకి' అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి.
ట్రైలర్ వచ్చాక సినిమా రూపు, రేఖలతో పాటు, భవిష్యత్ కూడా అర్ధమైపోయింది. వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించేందుకు సిద్ధమైపోతున్నాడు ఈ సినిమాతో. డైలాగులు, అప్పియరెన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి హరీష్ శంకర్‌లో కనిపిస్తోంది. తమిళ 'జిగర్తాండ'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తుండగా, మృణాళిని మరో హీరోయిన్‌గా నటిస్తోంది.