వారసుడు సినిమా విషయంలో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. అదే సమయంలో... చిరంజీవి - వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ - వీర సింహారెడ్డి సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. సంక్రాంతి లాంటి పండగ సీజన్‌లో.. అనువాద చిత్రాల్ని రిలీజ్ చేయకూడదని ప్రొడ్యూసర్ గిల్డ్ అల్టిమేట్టం జారీ చేసింది. దాంతో వారసుడు సినిమా ఇబ్బందుల్లో పడింది. సంక్రాంతికి వారసుడు విడుదల అవుతుందా, లేదా? అంటూ అనుమానాలు రేకెత్తాయి.కానీ దిల్ రాజు మాత్రం వారసుడు సినిమాని.. సంక్రాంతికే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
''సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చినా కావల్సినన్ని సంఖ్యలో థియేటర్లు ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి సమస్యా లేదు. వారసుడు సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని అందరికంటే ముందే ప్రకటించాం. మేం ప్రకటించిన తరవాతే.. వాల్తేరు వీరయ్య రిలీజ్‌డేట్ ఖాయం చేశారు. వీర సింహారెడ్డి.. డిసెంబరులో విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ జాప్యం వల్ల.. సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ తో మాకు గానీ, మా వల్ల మైత్రీకి కానీ ఎలాంటి ఇబ్బందీ లేదు. మేం టచ్‌లోనే ఉన్నాం. వారసుడు విషయంలో నిర్మాతల మండలికి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ నిర్మాతల మండలినే ఈ విషయంలో జోక్యం చేసుకొంది. సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉంద''న్నారు.