నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, జయసుధ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, షామ్ మరియు ఇతరులు
దర్శకుడు : వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హర్షిత
సంగీత దర్శకులు: థమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
రేటింగ్ : 2.5/5
సంక్రాంతి బరిలో మొదట డేట్ లాక్ చేసుకున్న చిత్రం విజయ్ వారసుడు. జనవరి 12న ఎట్టిపరిస్థితిలో వస్తామని నిర్మాత దిల్ రాజు చివరి నిమిషం వరకూ చెప్పారు. చివరి నిమిషంలో 11 చేశారు. ఇవన్నీ వదిలేసి.. ముందు తెలుగు హీరోలకు ప్రాధన్యత ఇవ్వాలని చెబుతూ చివరికి 14కి తెచ్చారు. ఇప్పటికే వారసుడు తమిళ వెర్సన్ విడుదలైయింది. అక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు వెర్షన్ పై పెద్దగా బజ్ లేదు. దిల్ రాజు సినిమా అంటే కాస్త హడావిడి వుంటుంది. కానీ ఈ సినిమాకి అది కనిపించలేదు. విజయ్ ప్రమోషన్స్ కి రాలేదు. కనీసం ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ పెట్టలేదు. అయితే దిల్ రాజుకి థియేటర్స్ సమస్య లేకపోవడం వలన కావాల్సినన్నీ స్క్రీన్స్ లో వారసుడుని వదిలారు. ఇప్పటికే వీరయ్య, వీరసింహ థియేటర్ లో వున్నాయి. అయితే వారసుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడంతో సంక్రాంతికి బాగా నడుస్తుందని దిల్ రాజు నమ్మకం. మరి దిల్ రాజు నమ్మకం నిజమైయింది ? వారసుడు సంక్రాంతికి ఫ్యామిలీ ట్రీట్ ఇచ్చిందా ?
కథ:
రాజేంద్ర (శరత్ కుమార్) ప్రముఖ వ్యాపార దిగ్గజం. రాజేంద్ర భార్య సుధ (జయసుధ) ఈ దంతతులకు ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). విజయ్ తన తండ్రి చూపించే బాటలో నడవడం ఇష్టంలేక ఇంటినుంచి బయిటకు వెళ్లిపోతాడు. జై, అజయ్ ల కన్ను మాత్రం చైర్మన్ పదవిపై కన్నేస్తారు రాజేంద్ర వ్యాపార ప్రత్యేర్ది జయ్ ప్రకాష్(ప్రకాష్ రాజ్). రాజేంద్ర వ్యాపారంపై కన్నేస్తాడు. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్...అనుకోని పరిస్థితిలో మళ్ళీ ఇంటికి వస్తాడు. తర్వాత ఏం జరిగింది? చైర్మన్ పదవి దక్కించుకున్నది ఎవరు ? రాజేంద్ర వ్యాపారానికి నిజమైన వారసుడు ఎవరు? రాజేంద్ర కుటుంబంలో వున్న సమస్య ఏమిటి ? చివరికి ఆ ఆకుటుంబం ఎలా ఒక్కటైయింది ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ మధ్య దర్శకులకు ఏమయిందో కానీ అందరూ ఫ్యాన్ బాయ్ లా తయారైయ్యారు. వీరసింహా, వీరయ్యని ఇద్దరు అభిమానులు లాంటి దర్శకులు డైరెక్ట్ చేస్తే.. వంశీ పైడి పల్లి ఏకంగా తమిళనాడు వెళ్లి అక్కడ విజయ్ కి ఫ్యాన్ బాయ్ గా మారి అతని అభిమానులు కొరుకునే అన్ని ముడిసరుకులు వండి ఒక రొటీన్ ఫ్యామిలీ కథని వారసుడిగా వార్చాడు. కథగా చెప్పాలంటే అందరికీ తెలిసిన కథే.. విడిపోయిన కుటుంబాన్ని ఫెవికిక్ లా అతికించేయాలని, తండ్రికి నిజమైన వారసుడిగా నిలవాలని ప్రయత్నించే ఓ కొడుకు కథ ఇది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ లా ఫ్యామిలీ పరిచయం చేస్తూ కథని మొదలుపెడతారు. ఆ పాత్రలు చాలా వరకూ ఎప్పుడో ఎక్కడో చూసినట్లే వుంటాయి. బలవంతంగా ఒక సంఘర్షణ చొప్పించి తర్వాత శతమానం భవతి టైపు.. ట్రాక్ ఒకటి నడుపుతారు. తర్వాత వచ్చిన సన్నివేశాలు అన్నీ ఊహకి అందిపోతుంటాయి. ఇంటర్వెల్ కూడా ఎలాంటి ఉత్సాహం క్రియేట్ చేయకుండానే పడిపోతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి కథ ఇంకా రొటీన్ అయిపోతుంది. ఫ్యాన్స్ ని తృప్తి పరుస్తూ విజయ్ అవసరం వున్నా లేకపోయినా ఎలివేషన్లు ఇచుకుంటూ వెళ్ళిపోయారు. హీరోని గొప్పవాడు తెలివైన వాడు మంచి వాడు అని చిత్రీకరిస్తే.. చప్పట్లు కొట్టుకొని చూసే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. కానీ విజయ్ పాత్రని దర్శకుడు వంశీ అదే ట్రీట్ మెంట్ ఇచుకుంటూ వెళ్ళాడు. ఒక ఎలివేషన్, ఒక ఎమోషనల్ సీన్ అన్నట్టుగా వుంటుంది. చివర్లో ముగింపు కూడా పరమ రొటీన్ గానే సాగిపోతుంది. ఐతే ఈ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆఫీస్ సన్నివేశం అల వైకుంఠపురములో సీన్ ని గుర్తుకు తెచ్చినా విజయ్ ఫ్యాన్స్ ని మాత్రంఅలరిస్తుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు అనేక సినిమాల రిఫరెన్స్ లు కనిపిస్తాయి. దీంతో అసలు ఇది వరిజినల్ సినిమానేనా అనే అనుమానంతోనే చూస్తుంటాడు ప్రేక్షకుడు. ఫ్యామిలీ ని ఎమోషన్స్ తో డీల్ చేయాలి. అంతేకానీ రెండు భారీ ఫైట్లు పెట్టి ఫ్యామిలీని కలిపేసే ప్రయత్నం చేయడం ఈ టైపు జోనర్ కథలకు అస్సల్ అతకలేదు.
నటీనటులు:
విజయ్ వన్ మ్యాన్ షో ఇది. దాదాపు సినిమా అంతా కనిపిస్తాడు. డ్యాన్స్ లో తన గ్రేస్ చూపించాడు. సెంటిమెంట్ సీన్స్ లో కొత్తగా కనిపిస్తాడు. యాక్షన్ సీన్స్ కూడా బావున్నాయి. రష్మిక అందంగా వుంది. అయితే ఆమె ట్రాక్ కేవలం పాటలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్. కిక్ శ్యామ్ తమ అనుభవం చూపించారు. జయసుధ మరోసారి మదర్ గా కట్టిపడేసింది. కాసేపే అయినా ఎస్ .జె సూర్య ప్రజన్స్ బావుంది. మిగతా నటులు పరిధిమేర చేశారు.
టెక్నికల్ :
మంచి ప్రొడక్షన్ డిజైన్ కనిపిస్తుంది. గ్రాండ్ గా తీశారు. తమన్ నేపధ్య సంగీతం బావుంది. కొన్ని చోట్ల మనసుని హత్తుకునేలా చేశాడు. రంజితమే పాట చూడటానికి బావుంది. రిచ్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. నిడివి చాలా ఎక్కువ. యోగి బాబు, విజయ్ లా వన్ ట్రాక్ వినోదం పంచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి వున్నాయి.
ప్లస్ పాయింట్స్
విజయ్
యోగి బాబు కామెడీ
పాటలు, తమన్ నేపధ్య సంగీతం, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
బలహీనమైన కథనం
వర్క్ అవుట్ కాని ఎమోషన్
ఫైనల్ వర్దిక్ట్ : పండక్కి వచ్చిన పాత చుట్టం.