నటీనటులు : నాగ శౌర్య, రీతు వర్మ, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ
సంగీతం : విశాల్ చంద్రశేఖర్, థమన్
సినిమాటోగ్రఫర్ : వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్: 2.75/5
నాగశౌర్య మంచి ఫామ్ లో వున్నాడు. ఛలో లాంటి సూపర్ హిట్ కొట్టాడు. అశ్వద్ధామ లాంటి విభిన్నమై సినిమాతో అలరించాడు. అయితే తర్వాత కరోనా లాక్ డౌన్ తో దాదాపు రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. అయితే ఎట్టకేలకు వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రమిది. మహిళా దర్శకురాలు లక్ష్మీసౌజన్య దర్శకత్వం. సితార బ్యానర్ నుంచి సినిమా రావడం, ట్రైలర్ టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలని సినిమా అందుకుందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ
భూమి (రీతూ వర్మ) ఒక స్టార్టప్ నడుపుతుంటుంది. భూమి అంటే ఆఫీస్ లో అందరికీ హడల్. ప్రేమ - పెళ్లి విషయాలపై పెద్దగా నమ్మకాల్లేవు. ఇంట్లో తనకెన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా రిజెక్ట్ అయిపోతుంటాయి. ఆకాష్ (నాగశౌర్య) ఫారిన్ స్థిరపడిన ఓ ఆర్కెటిక్. ఓ పని మీద ఇండియా వస్తాడు. ఇక్కడ భూమిని చూసి ఇష్టపడతాడు. ఆమె మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆకాష్. గతంలో వీరిద్దరికీ ఓకే ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ? ప్రేమ - పెళ్లి పై భూమికి ఎందుకు నమ్మకం వుండదు ? చివరికి ఆకాష్ , భూమి కలిశారా లేదా ? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ
కొంతమంది దర్శకులు సినిమాకి పెద్ద కథ అవసరం లేదని నమ్ముతారు. వారి నమ్మకం నిజమే. చాలా చిన్న పాయింట్లతో అద్భుతాలు సృస్టించిన సినిమాలు బోలెడు. వీటి లైటర్ వెయిన్ సినిమాలు అంటారు. 'బొమ్మరిల్లు' సినిమా చూసుకుందాం. అందులో ఏం గొప్ప కధ వుంది? కానీ ట్రీట్మెంట్ గొప్పగా వుంటుంది, అలాంటి లైటర్ వైయిన్ పాయింట్లకు ట్రీట్మెంట్ కీలకం. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య కూడా 'వరుడు కావలెను' కోసం చిన్న కధే రాసుకుంది. అయితే ఆ కధకు ఆమె ఎంచుకున్న ట్రీట్మెంట్ అందంగా కుదిరింది. భూమిక, ఆకాష్ పాత్రల చుట్టూ అల్లుకున్న ట్రీట్మెంట్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. మొదటి సగం భూమి, ఆకాష్ ల మధ్య జరిగే సీన్స్, మన్మధుడు సినిమాని గుర్తుకు తెచ్చే ఆఫీస్ ఫన్, కూతురి పెళ్లి కోసం తల్లి నదియా పడే పాట్లు .. ఇవన్నీ సరదాగా సాగిపోతాయి. అయితే కేవలం ఎదో సంఘర్షణ కోసం వేసిన ఇంటర్వెల్ బాంగ్ మాత్రం అంత ఆకట్టుకోదు.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా అంత ఆసక్తికరంగా సాగలేదు. కాలేజీ ఎపిసోడ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందని భావించిన దర్శకురాలు. అయితే ఇది చాలా నార్మల్ గా సాగిపోతుంది. ఈ ఎపిసోడ్ ని మరోలా డిజైన్ చేసుంటే ఫలితం వేరేలా వుండేది. చివర్లో పెళ్లి ఐ కూతురు అభిప్రాయం ఏమిటో తల్లితండ్రులు తెలుసుకోవాలని పెట్టిన సీన్లు మెసేజ్ ఇచ్చినట్లు అనిపిస్తాయి. ఇక కైమాక్స్ కూడా ప్రేక్షకుడి ఊహకి ముందే అందిపోతుంది. అయితే సెకండాఫ్ `లాగ్` కామెడీ ఎపిసోడ్ మాత్రం సినిమాని నిలబెట్టింది. ఇది సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది.
నటీనటులు
నాగశౌర్య హుందాగా కనిపించాడు. ఆకాష్ పాత్రకి చక్కగా కుదిరిపోయాడు. అతనికి లుక్, స్మైల్ క్లాస్ గా అనిపించాయి. కాలేజీ ఎపిసోడ్ లో మరింత లేతగా కనిపించాడు. ఈ సినిమా చూశాక శౌర్య కోసం కాలజీ కధలు రాసుకుంటారు దర్శకులు. అంత ముచ్చటగా వున్నాడు. రీతూ వర్మ సినిమా ఇది. అంత మంచి పాత్ర దక్కింది.
దర్శకురాలు భూమి పాత్రని బలంగా రాసుకుంది. అందం అభినయంలో రీతూ అదరహో అనిపించింది. పెళ్లి చూపులు తర్వాత రీతు గుర్తుపెట్టుకునే పాత్ర భూమి. నదియా పాత్ర బావుంది. ఒక తల్లి ఆరాటం ఆమె పాత్రలో కనిపిస్తుంది మురళీ శర్మ ఓకే. సప్తగిరి ట్రాక్ హైలెట్ గా నిలిచింది. మిగతా నటీనటులు పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం
మ్యూజిక్ చక్కగా కుదిరింది. దిగు దిగు దిగు నాగ.., పెళ్లి పాట ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం ఓకే. గణేష్ రావూరి డైలాగ్స్ త్రివిక్రమ్ ని గుర్తు చేస్తాయి. కెమరా పనితనం బావుంది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. చిన్న పాత్రకి సైతం పేరున్న నటీనటుల్ని తీసుకురావడం ప్లస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్
నాగశౌర్య రీతూ వర్మ నటన
క్లీన్ డ్రామా , డైలాగ్స్
మంచి పాటలు
డీసెంట్ కామెడీ
మైనస్ పాయింట్స్
సంఘర్షణ లేకపోవడం
కథలో మలపులు లేకపోవడం
ఫైనల్ వర్డిక్ట్ : ఫ్యామిలీకి నచ్చే వరుడు