హీరోల మధ్య ఎప్పుడూ ఎలాంటి పొరపొచ్చాలూ ఉండవు. ఈ విషయం పదే పదే నిరూపణ అవుతూనే ఉంది. కానీ, ఆయా హీరోల అభిమానులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఎప్పటికప్పుడే రచ్చ చేస్తూనే ఉన్నారు. పొరపొచ్చాలు పెంచుకుంటూనే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిన సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తమ ధోరణి ఎంతమాత్రమూ మార్చుకోవడం లేదు. తాజాగా ఈ ఇష్యూ ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే, ఎన్టీఆర్ - చరణ్‌ల గురించి మన గద్దల కొండ గణేష్ ఓ నిజాన్ని చెప్పాడు.
ఇటీవల విడుదలైన తన సినిమా 'గద్దలకొండ గణేష్' విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాట్లాడేందుకు వరుణ్, చరణ్ వద్దకు వెళ్లగా, ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నాడట. చరణ్‌తో కలిసి సరదాగా కాఫీ తాగుతూ కనిపించాడట ఎన్టీఆర్. అలా వారిద్దరినీ చూసిన వరుణ్ తన సినిమా వివాదాన్ని మర్చిపోయి వారితో కలిసి తాను కూడా ఎంజాయ్ చేశాడట. అలా మన హీరోలు ఆయా సందర్భాల్లో ఇలా ఎంజాయ్ చేసిన పలు సందర్భాలు వింటూనే ఉన్నాం. కొన్ని చూస్తూనే ఉన్నాం. కానీ, ఫ్యాన్స్ మాత్రం పంతాలు వదలడం లేదు.
తాజాగా 'సైరా' సినిమాకి సంబధించి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్న సంగతులు చూస్తున్నాం. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి కొన్ని సినిమా ఫంక్షన్స్‌లో బహిరంగ వేడుకలపైనే చూశాం. ఇప్పుడు ఏకంగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కూడా. ఇదంతా చూస్తున్నా, ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య రగడకు మాత్రం చెక్ పడడం లేదు. చూద్దాం 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతోనైనా ఫ్యాన్స్ మధ్య ఈ వివాదాలు సమసిపోతాయేమో.