మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డు జోరు మీదుంది. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్నాడు. ఈ జనరేషన్ యంగ్ హీరోల్లో వరుణ్ రేస్‌ని అందుకోవడం ఇప్పుడప్పుడే ఎవ్వరి తరం అయ్యేలా కనిపించడం లేదు. కొత్త, పాత అనే తేడా లేకుండా దర్శక నిర్మాతలు వరుణ్ కోసం క్యూ కట్టేస్తున్నారు. అయితే, వరుణ్ అస్సలేమాత్రం తొందరపడకుండా ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తనకు తగ్గ కథలను ఎంచుకుంటున్నాడు. కథలను ఎంచుకోవడంలో వరుణ్‌కి మెగాస్టార్ చిరంజీవి అంతటి ముందు చూపు ఉందని ఆయన సన్నిహితులు చాలా మంది చెబుతుంటారు.
అది నిజమే కూడా. సినిమా సినిమాకీ డిఫరెంట్ స్టోరీల్ని ఎంచుకోవడంతో పాటు, సక్సెస్‌లు అందుకోవడంలోనూ వరుణ్ తేజ్ విజయం సాధిస్తున్నాడు. ఇటీవల 'గద్దలకొండ గణేష్'తో బాక్సాఫీస్ బద్దలుకొట్టిన వరుణ్ తేజ్, తదుపరి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు. ఆయన కెరీర్‌లో తొలిసారి స్పోర్ట్స్ జోనర్‌ని టచ్ చేశాడు వరుణ్ తేజ్ ఈ సినిమాతో.
ఇటీవల లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్‌లో స్పెషల్ కోచింగ్ కోసం ముంబై వెళ్లాడు. అక్కడ బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరనే అంశంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.