గద్దల కొండ గణేష్ తో వరుణ్ తేజ్ ఫాలోయింగ్ పూర్తిగా మారిపోయింది. వరుణ్ లో ఓ మాస్ హీరో కనిపించాడు జనాలకు. ఆ తరవాత... తన అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కొర్రపాటి కిరణ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా మొదలెట్టాడు వరుణ్. ఈ సినిమాపై వరుణ్‌కి చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా నిలబడిపోతానని నమ్ముతున్నాడు. కానీ ఈ సినిమా కి ఎన్ని సమస్యలో? ఇంకెన్ని అడ్డంకులో..? లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆ తరవాత షూటింగ్ మొదలెడదామంటే... ఫిట్ నెస్ సమస్యల కారణంగా వాయిదా పడింది.
లాక్ డౌన్ కారణంగా వరుణ్ ఇంట్లోనే ఉండడం వల్ల.. బాగా బరువు పెరిగిపోయాడని టాక్. బరువు తగ్గి, సినిమాకు తగ్గట్టుగా మారడానికి వరుణ్ కి కొంత సమయం పట్టింది. ఇప్పుడు నాగబాబుకి కరోనా సోకడంతో.. వరుణ్ కూడా హోం క్వారెంటైన్ నిబంధనలు పాటించాల్సివస్తోంది. మరో 20 రోజుల వరకూ.. వరుణ్ సైతం బయటకు రాకపోవొచ్చు. అంత వరకూ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశమే లేదు. ఆ తరవాత... నిహారిక పెళ్లి హడావుడి మొదలయ్యే ఛాన్సుంది. ఇలా ఎలా చూసినా.. వరుణ్ బాక్సింగ్ కథ.. పట్టాలెక్కడానికి ఏదో ఓ రూపంలో అవతాంతరం వస్తూనే ఉంది. మరి... ఇవన్నీ ఎప్పుడు చక్కబడతాయో, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో?