మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో దేన్నయినా రీమేక్ చేసే అవకాశం వుందా.? చేస్తే ఏ సినిమా బావుంటుంది.? ఈ ప్రశ్నలకు మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ‘కొదమసింహం’ సినిమా అయితే వరుణ్ తేజ్‌కి బావుంటుందని నాగబాబు అభిప్రాయపడ్డారు. అయితే, మెగాస్టార్ సినిమాల్ని రీమేక్ చేయడం అంత తేలిక కాదనీ, మెగాస్టార్‌ని మ్యాచ్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అవుతుందని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే, సినిమా సినిమాకీ నటుడిగా పరిణతి చెందుతూ వస్తున్నాడు వరుణ్ తేజ్.
చేసే ప్రతి కొత్త సినిమానీ చాలా డిఫరెంట్‌గా వుండేలా ప్లాన్ చేసుకుంటున్న వరుణ్, ముందు ముందు మెగా రీమేక్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదిలా వుంటే, మెగా రీమేక్స్ విషయంలో రామ్ చరణ్ ఓ ఖచ్చితమైన ఐడియాతో వున్నాడు. తన తండ్రి సినిమాలకు సంబంధించిన రీమేక్స్ పట్ల రామ్ చరణ్ ఆసక్తి చూపడంలేదు. మరోపక్క సాయిధరమతేజ్ కూడా మెగాస్టార్ సినిమాల రీమేక్ విషయమై కొంత ‘దూరం’ పాటిస్తున్నాడు. ఎందుకంటే, మెగాస్టార్ నటించిన క్లాసిక్ మూవీల్లో నటించి, ఒకవేళ అవి ఆశించిన విజయాల్ని అందుకోకపోతే కష్టమే కదా.! ఆ బ్యాడ్ ఇమేజ్ మూటగట్టుకోవడం ఇష్టం లేకనే ‘మెగా’ రీమేక్స్ వైపు మెగా కాంపౌండ్ హీరోలు దృష్టి సారించడంలేదు.