గొప్ప సినిమా తీయడం వేరు. ఆ సినిమా ఆడడం వేరు. మంచి సినిమాలు ఒక్కోసారి సరిగ్గా ఆడకపోవచ్చు. కానీ వాటికి మంచి సినిమాలు అనే గుర్తింపు మాత్రం వస్తుంది. అలాంటి గుర్తింపు కూడా రాలేదంటే, ఏ దర్శకుడైనా, తనను తాను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, నేను గొప్ప సినిమా తీశాను. అది చూడడం జనాలకు చేతకాలేదు అనడం మూర్ఖత్వమే అవుతుంది. పెద్ద పెద్ద దర్శకులే ఈ విషయంలో తొందరపడి ఆ తర్వాత తప్పు తెలుసుకున్నారు.
తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ రివ్యూలపై మండి పడ్డాడు. సినిమా నచ్చలేదంటే సినిమా చూడడం రాలేదనే.. అంటూ నోరు జారాడు. 'వీర భోగ వసంతరాయలు' డైరెక్టర్ ఇంద్రసేన ఓవరాక్షన్ ఇది. సినిమా వచ్చి పోయింది. రివ్యూలపై ఇంద్రసేన ఓవరాక్షన్ చేయడం హీరో శ్రీవిష్ణుకీ నచ్చలేదు. రివ్యూలను గౌరవిస్తాననీ, త్వరలో ఓ మంచి సినిమా కబురుతో టచ్‌లో ఉంటాననీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫేక్ రివ్యూస్ అంటూ ఇంద్రసేన పోస్ట్ చేయడం, పోస్టర్ రూపొందించి వదలడం వివాదాస్పదమైంది.
వివరణ ఇచ్చే క్రమంలో ఎవరికీ అర్ధం కానీ మాటలు మాట్లాడి ఆ తర్వాత సైనింగ్ ఆఫ్ పేర్కొన్నాడు. చివరిగా హిమాలయాలకు వెళ్తున్నా అని సెలవిచ్చాడీ యంగ్ డైరెక్టర్. నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియా, శ్రీవిష్ణు లాంటి మేటి నటుల్ని పెట్టుకుని సినిమా తీయడం చేతకాలేదు కాబట్టి హిమాలయాలకు వెళ్లడం సబబే.