విక్టరీ వెంకటేష్ కూతురు పెళ్లి పీటలెక్కబోతోందట. అవును మీరు విన్నది నిజమే. వెంకీకి ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు. ఆయన పెద్ద కూతురు ఆశ్రిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారమ్. అబ్బాయి ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘురామి రెడ్డి కుమారుడట.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. అబ్బాయి తాత సురేందర్ రెడ్డి హైద్రాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ కావడంతో ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వెంకటేష్ 'ఎఫ్ 2' సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఆయన షూటింగ్ నుండి రాగానే వీరి ఎంగేజ్‌మెంట్‌కి ముహూర్తం కుదర్చనున్నారట. అంటే దగ్గుబాటి వారింట పెళ్లి బాజా మోగేందుకు సిద్ధంగా ఉంది.
దగ్గుబాటి అభిమానులకు ఇది పండగలాంటి వార్తే. వెంకటేష్ ఈ మధ్యనే సినిమాలతో బిజీ అయ్యారు. 'గురు' తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలకు సైన్ చేసి, జోరు మీదున్నారు. ఆల్రెడీ 'ఎఫ్ 2' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. తర్వాత నాగచైతన్యతో 'వెంకీ మామ' చిత్రంలో వెంకటేష్ నటించనున్నారు.