వెంకటేష్ - సౌందర్య జంటగా నటించిన `జయం మనదేరా` సినిమా గుర్తుందా? శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి ఇరవై ఏళ్లు. ఫ్యాక్షన్ కథని మంచి కమర్షియల్ సినిమాగా మలచి హిట్టు కొట్టారు. వెంకీ టాప్ 10 సినిమాల్లో ఇది కూడా తప్పకుండా ఉంటుంది. కథ సరదాగా మొదలై, ఫ్యాక్షన్ బాట పట్టి, డ్యూయెల్ రోల్ తో కనికట్టు చేసి, వెంకీ అభిమానులకు కావల్సిన వినోదం, మసాలా పంచి పెట్టి - సక్సెస్ అయ్యింది ఈసినిమా. అన్నట్టు ఈ సినిమా కోసం రెండు క్లైమాక్సులు రాసుకున్నార్ట.
ముందు రాసుకున్న క్లైమాక్స్ వెంకటేష్‌కి ఏమాత్రం నచ్చకపోవడంతో.. ఓ హిందీ సినిమా సీడీని శంకర్ చేతిలో పెట్టాడట వెంకటేష్. `ఈ సినిమాలో ఉన్నట్టు క్లైమాక్స్ తీద్దాం` అన్నాడట. కానీ శంకర్‌కి తన క్లైమాక్స్‌పై గట్టి నమ్మకం. అందుకే `రెండు క్లైమాక్సుల్నీ తీద్దాం. ఏది బాగుంటే అది పెట్టుకుందాం` అనేసరికి.. వెంకీ కూడా కాదలనలేకపోయాడు. అయితే ముందుగా హిందీ సినిమాలో ఉన్నట్టు క్లైమాక్స్ తీసేశారు. రెండో క్లైమాక్స్ తీయడానికి టైమ్ లేకుండా పోయింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. దర్శకుడు తాను రాసుకున్న క్లైమాక్స్ ని పక్కన పెట్టేయాల్సివచ్చింది. అలానే సినిమా విడుదలైపోయింది. శంకర్ రాసిన క్లైమాక్స్ తీస్తే.. ఈ సినిమా రేంజ్ ఎలా ఉండేదో మరి.