'ప్రేమమ్' సినిమాలో కాస్సేపు గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడు వెంకటేష్. చైతూకి మామయ్య క్యారెక్టర్‌లోనే ఆ కాస్సేపు కనిపిస్తాడు. ఆ కాస్సేపు సినిమాలో తెలీని ఓ జోష్ వచ్చేస్తుంది. అక్కడ క్యారెక్టర్స్ కనిపించవు. చాలా లైవ్‌గా అనిపిస్తుంది ఆ సీన్. చాలా కొంచెం సేపు మాత్రమే ఉండే ఆ సీన్ అయ్యో అప్పుడే అయిపోయిందా? ఇంకాస్సేపుంటే బావుండనిపిస్తుంది. అందుకే ఆ కోరిక తీర్చేందుకే ఈ మామా అల్లుళ్లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఈ సారి కాస్సేపు కాదు, ఫుల్ లెంగ్త్‌లో వెంకీ, చైతూ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. ఈ సినిమాకి 'వెంకీ మామ' టైటిల్‌ని దాదాపుగా ఖరారు చేసినట్లే అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ఇక అఫీషియల్‌గా ప్రకటించడమే తరువాయి. ఇకపోతే సినిమాలో చైతూ, వెంకీ కెమిస్ట్రీ అదిరిపోతుందట. సినిమా చూసినట్లుగా కాక, ఇంట్లో మనింట్లో నట్టింట్లో ఓ మామా, అల్లుడి మధ్య జరిగే నేచురల్ సంభాషణలు, సన్నివేశాల ఫీల్ ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట డైరెక్టర్ బాబి.
ఇటీవల బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవకుశ' ఆశించిన విజయాన్ని కాకపోయినా, ఫర్వాలేదనిపించింది. ఇప్పుడీ 'వెంకీ మామ'తో బాబీ మంచి హిట్ కొడతాడనే నమ్మకం చిత్రయూనిట్ కల్గిస్తోంది. వెంకటేష్ బాగా స్లిమ్‌గా హ్యాండ్‌సమ్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు.
మరోవైపు వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2' సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. చైతూ నటిస్తోన్న 'సవ్యసాచి' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.